గద్వాలటౌన్, నవంబర్ 10 : శ్రీరాముడు నడయాడిన పుణ్యస్థలం..కల్యాణ వేంకటేశ్వరుడు కొలువుదీరిన పవిత్ర క్షేత్రం.. పరమశివుడు స్పటికలింగేశ్వరుడిగా లింగ రూపం లో దర్శనమిచ్చే దివ్యక్షేత్రం.. సకల దేవతల నిలయంగా విరాజిల్లుతున్న నదీఅగ్రహారంలోని కృష్ణా నదితీరాన కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం కొత్త వెలుగులను నింపిం ది.. శివపార్వతుల కల్యాణోత్సవం కమణీయంగా సాగిం ది.. రుద్రాభిషేకం, అర్చనలు, అభిషేకాలు, భక్తుల నీరాజనాలతో కోటి దీపోత్సవం వైభవంగా సాగింది.. ఆదిదంపతులను దర్శించుకున్న అనుభూతిలో భక్తుల శివనామస్మరణతో నదితీరం మార్మోగింది.. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని నదిఅగ్రహారం వద్ద ఉన్న కృష్ణానదితీరాన కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం కోటి దీపోత్సవం నిర్వహించారు.
ముందుగా పుణ్యవాహచనం శివ రుద్రాభిషేకంతో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేదికపై కొలువుదీరిన ఆది దంపతులను దర్శించుకున్న భక్తులు పులకరించిపోయారు. తదనంతరం కృష్ణమ్మకు హారతి సమర్పించి కోటి దీపోత్సవాన్ని నిర్వహించారు. తమ తప్పులను మన్నించి కొత్త వెలుగును ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ భక్తులు దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణతో వేడుకలను ముగించారు. కార్యక్రమాలు అర్చకుడు ప్రసన్నాచారి బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయట్రస్టు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.