కల్వకుర్తి, ఏప్రిల్ 28 : రాష్ట్ర ప్రభుత్వం ముక్కుతూ.. మూల్గుతూ ఏర్పాటు చేసిన మక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు దైవాధీనంగా మారాయి. కొనుగోళ్లకు సంబంధించి నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రోజుల తరబడి రైతులు తాము పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారు. ఒకవైపు ఎండ వేడి, తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక రైతులు అల్లాడుతున్నారు. ఏ రైతును కదిలించినా..అంతా మా కర్మ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదన్నందుకు తగిన ఫలితం అనుభవిస్తున్నామని వాపోతున్నారు..
మక్క ధాన్యాన్ని వ్యాపారులు కింటాల్కు రూ.1650 గరిష్ఠంగా చెల్లిస్తున్నారు. ఎంఎస్పీ రూ.2400 ఉంది. అందుకే రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ప్రభుత్వం చచ్చిచెడి రెండు, మూడు మండలాలకు ఒక చోట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొనుగోలు బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. సిబ్బంది లేని మార్క్‌ఫెడ్ ఏజెన్సీ కొనుగోలు చేయలేక చేతులేత్తేసే పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు క్యూలైన్లు నిత్యకృత్యమయ్యాయి. యూరియా కోసం క్యూలైన్లు, చెప్పులు వరుస సంఖ్యలో పెట్టడం సహజంగా మారింది. ఇప్పుడు మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో కూడా క్యూలైన్ పరిస్థితి దాపురిందించింది. పండించిన పంట అమ్ముకునేందుకు కూడా క్యూలైన్ పాటించడం కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని రైతు సంఘాల నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. గన్నీ బ్యాగుల కోసం క్యూలైన్లు. రోజుల తరబడి ఎదురుచూడటం, పీఏసీసీఎస్‌ల వద్ద పడిగాపులు గాయడం, గన్నీ బ్యాగులు లభించకపోవడంతో బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయడం రైతులకు తప్పడం లేదు. చచ్చి చెడి గన్నీ బ్యాగులు సమకూర్చుకుంటే.. వాటిని తూకాలు వేయడం, తూకాలు వేసిన తర్వాత, రైతు తన వివరాలను బయోమెట్రిక్ చేయడం, బయోమెట్రిక్ అయిన తర్వాత ధాన్యాన్ని గోదాంకు తరలించడం పెద్ద తతంగంలా మారింది.
ముందు చూపు లేకపోవడంతో కొనుగోలు చేసిన మక్కను నిలువ ఉంచేందుకు గోదాంలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి చుట్టుపక్కల ఐదారు మండలాలకు చెందిన రైతులు తాము పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని తీసుకువస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు కేవలం ఒక్కటే గోదాంను (పత్తి జిన్నింగ్ మిల్లును) అద్దెకు తీసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యంలో పావు వంతు మాత్రమే మిల్లులో నిండిపోతుంది. మిగతా ధాన్యం ఎక్కడ నిల్వ ఉంచుతారు. దీనికి తోడు హమాలీల సమస్య. ఈ కారణాల చేత ధాన్యం అమ్ముకునేందుకు దాదాపు వారానికి పైగా పడిగాపులు పడాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడింది.
కల్వకుర్తి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద మొక్కజొన్న వాహనాలు, రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం, బయోమెట్రిక్ వద్ద రైతుల లేన్లు. చివరకు గోదాం వద్ద రైతులు తీసుకువెళ్లిన మొక్కజొన్న వాహనాలు బారులు దీరాయి. ఏ రైతును కదిలించినా.. నాలుగు రోజులైంది. ఐదు రోజులైంది అంటూ సమాధానాలు ఇస్తున్నారు. మాకష్టం పగవానికి కూడా రావద్దని రైతులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడుతున్నారు. ఇది ఇలా ఉంటే.. వరి కొనుగోళ్లలో ఇంకా ఏం వెలగబెడుతారో అంటూ రైతులు ఎద్దేవా చేస్తున్నారు.