కొల్లాపూర్ రూరల్, మే 26 : కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు వరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ధాన్యం కొనగోళ్ల విషయంలో కన్న కష్టాలు పడుతున్నారు. కొల్లాపూర్ మార్కెట్ యార్డులో కొన్ని రొజుల నుంచి వడ్లు ఆరబెటుకోవడానికి స్థలాలు లేకపోవడంతో చాలా వరకు ధాన్యం అంతా పొలాల్లోనే ఉండిపోయింది. గత వారం పది రోజుల నుంచి రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు మార్కెట్కు తీసుకువచ్చినా మార్కెట్ అధికారులు కాంటా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేది లేక ప్రతిరోజూ రైతులు ధాన్యం ఆరబెట్టడం, కుప్పలు కట్టడంతోనే సరిపోయింది.
ఈ క్రమంలో ఆదివారం కురిసిన వర్షానికి మార్కెట్లో ఆరబోసిన ధాన్యం అంతా తడిసి ముద్దయింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయకుండా కాలయాపన చేయడంతో మార్కెట్కు వచ్చిన ధాన్యం అంతా తడిముద్దయ్యిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఎన్నో కష్టాలు పడి పంటలు పండించి చేతికి వచ్చిన పంటలను అమ్ముకోవాలంటే కూడా ఎన్నో కష్టాలు పడే పరిస్థితికి వచ్చిందని వాపోతున్నారు. ఎప్పటికప్పుడు రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టి ఉంటే ధాన్యం తడిసి ఉండేది కాదని, రైతులం ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కాదని, తడిసిన ధాన్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించి తడిచిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వ్యవసాయాధికారులు ముందుగా పంటలు సాగు చేసే సమయంలో తగిన సలహాలు, సూచనలు చేసి రైతులను చైతన్యం చేయడంతో విఫలమయ్యారని, అందుకే రైతులు పంటల సాగులో వెనుకబడి పోయి నేడు అకాల వర్షాలతో ధాన్యం కాపాడుకోవడం కష్టతరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సాగులోనైనా వ్యవసాయాధికారులు రైతులకు పంటల సాగుపై సరైన అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
వీపనగండ్ల, మే 26 : యాసంగిలో పండించిన ధాన్యాన్ని రెండు నెలలు అవుతున్నా కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. దీంతో రైతులు కొన్ని రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే ఉంచుకొని పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సరైన సౌకర్యాలు లేకపోవడం, కనీసం ధాన్యం తడవకుండా ఉండేందుకు కవర్లు కూడా ఇవ్వకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం మొత్తం తడిసి మొలకెత్తుతుండడంతో అన్నదాతలకు ఆందోళనకు గురవుతున్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికలకు లేకపోవడం వల్లే కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, కవర్ల కొరత, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీల కొరత ఏర్పడడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ధాన్యానికి సరిపడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచి పోయింది. దీంతో చేసేదేమీలేక రైతులు గత కొద్ది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో స్పందించిన అదనపు కలెక్టర్ మండల కేంద్రం సమీపంలోని మార్కెట్ యార్డు గోదాముకు ధాన్యాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
అయినా కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి ధాన్యాన్ని పెట్టుకొని వేచి ఉండడం ఇబ్బందికరంగా మారడంతో రైతులే నేరుగా ధాన్యాన్ని బస్తాలకు నింపుకొని ట్రాక్టర్లలో గోదాములకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో గోదాముల వద్ద కూడా భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. ఇదే అదునుగా భావించిన మిల్లలు తేమ శాతం పేరుతో క్వింటాకు రెండు నుంచి మూడు కిలోల తరుగు తీస్తుండడం రైతులను మరింత వేదనకు గురిచేస్తున్నది. ఏది ఏమైనా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల వద్దకే నేరుగా వెళ్లి ధాన్యం కొనుగోళ్లు చేపట్టగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కొనుగోళ్ల విషయం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది.