గద్వాల అర్బన్, డిసెంబర్ 21 : సీఎంఆర్ వడ్ల సరఫరాలో మిల్లు నిర్వాహకులు పెద్ద మొత్తంలో అవినీతి చేయడంతో కేసులు నమోదు చేసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోడంపై అధికారులమీద తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయంపై గురువారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘కేసులు సరే.. రికవరీ ఏదీ..’ అనే పేరుతో ప్రచురితనమైన కథనంపై అధికారులు స్పందించి రహస్యంగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. సీఎంఆర్ వడ్లు 2021లో రైతుల నుంచి ఐకేపీ ద్వారా కొనుగోలు చేసి అనంతరం మిల్లులకు రీసైక్లింగ్‌కు తరలించిన అనంతరం వారి దగ్గర నుంచి బియ్యం పట్టించి ప్రభుత్వానికి అందజేయాలి. ఈ క్రమంలో కొంత మంది రైస్ మిల్లు నిర్వాహకులు ఇదే అదునుగా భావించి రైతుల నుంచి వచ్చిన వడ్లను కొంత మేర బియ్యం రీసైక్లింగ్ చేసి మరి కొంత వడ్లను అమాంతం నొక్కి భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ అవకతవకలలో ప్రభుత్వ అధికారులకు కూడా భాగస్వాములుగా ఉన్నారని, వారిదే కీలకపాత్ర అంటూ ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
అయితే ఈ విషయంపై ఈ మధ్యనే జిల్లా అధికారుల సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు పౌరసరఫరా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే. జిల్లాలో రైతుల నుంచి వడ్లు తీసుకుంటున్న మిల్లులు ఏ మేరా.. బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేశారో వివరాలు చెప్పాలని అధికారులను కోరగా అధికారులు నీళ్లు నమిలారు. మంత్రి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు ఈ విషయంపై పోలీస్ అధికారులకు సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. పోలీస్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి మొదలైంది.. వానకాలం, యాసంగి రెండు దఫాలుగా ఏ మిల్లు ఎన్ని వడ్లు తీసుకొని తిరిగి ప్రభుత్వానికి ఎంత అందజేశారో అన్ని విషయాలను ఉన్నతాధికారుల నుంచి లెక్కలు తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. పోలీసులు విచారణ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న మిల్లు నిర్వాహకులు ఇప్పటికే పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. సీఎంఆర్ వడ్లపై ప్రత్యేక బృందాల ద్వారా రహస్యంగా విచారణ చేపట్టి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేయాలని, అక్రమాలకు పాల్పడి వారి దగ్గర నుంచి రికవరీ చేయాలని, అనంతరం వారి మీద కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీస్ అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో కొంత మంది పేర్లను పరిశీలించి విచారణ కూడా మొదలు పెట్టారు.
సీఎంఆర్ వడ్ల విషయం లో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు. ఈ విషయానికి సం బంధించి ఇప్పటికే జిల్లాలో కొన్ని కేసులు నమోదు చేశాం. అధికారుల లెక్కల ప్రకారం ఏ మిల్లు నిర్వాహకులు ఎన్ని వడ్లు తీసుకొని.. ఎంత బియాన్ని ప్రభుత్వానికి ఇచ్చారో విషయాలపై ఆరా తీస్తున్నాం. ప్రత్యేక పోలీస్ అధికారులతో విచారణ చేపట్టాం. ఇందులో అవినీతికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. బియ్యంను రికవరీ చేస్తాం.
వెంకటేశ్వర్లు, డీఎస్పీ, గద్వాల