ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. గులాబీ పార్టీ నుంచి బరిలో నిల్చొనే అభ్యర్థులను సీఎం కేసీఆర్ ముందుగానే ప్రకటించారు. తన వ్యూహంతో ఎన్నికల సమరానికి సై అంటూ ఉమ్మడి జిల్లాలోని 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ సీట్లు కేటాయించారు. దీంతో ఏడుగురు హ్యాట్రిక్.. ఐదుగురు రెండోసారి గెలుపునకు ఉవ్విళ్లూరుతున్నారు. క్యాడర్లో సమరోత్సాహం నెలకొన్నది. క్యాంప్ కార్యాలయాల వద్ద సందడి ఉంటున్నది. తమపై నమ్మకంతో మరోసారి టికెట్లు కేటాయించిన అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసి శుభాభినందనలు తెలియజేశారు.
ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలుపు ఢంకా మోగించి విజయాన్ని ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిత్వం ఖరారైన వారు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ దూకుడు పెంచారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు అభ్యర్థులు నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో మర్రి జనార్దన్‌రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టగా.. ప్రతిపక్షాలకు మాత్రం అభ్యర్థులు కరువయ్యారు. హస్తంలో వర్గపోరు తారాస్థాయికి చేరి వారిలో వారికే అంతర్యుద్ధం కొనసాగుతున్నది. నిత్యం లొల్లితో రచ్చకెక్కుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. కమలం పార్టీకి అభ్యర్థులు కరువై నిస్తేజం కనిపిస్తున్నది. దీంతో రెండు పార్టీల నేతలు టికెట్ల డైలమాలో పడ్డారు.
మహబూబ్‌నగర్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈసారి ఎన్నికల్లో అన్ని స్థానాలు క్లీన్‌స్వీప్ చేసేందుకు బీఆర్ఎస్ పక్కాగా స్కెచ్ వేసింది. ఈసారి అనుకున్నట్లుగానే అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి విపక్షాలకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జి ల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సిట్టింగులకు టికెట్లు కేటాయించింది. ఆయా నియోజకవర్గాల నేతల మధ్య సమన్వయం చేసి పార్టీ అధినేత కేసీఆర్ టికెట్లు ఖరారు చేశారు. టికెట్లు ఆశిస్తున్న వారిని.. కీరోల్ పోషించే ఎమ్మెల్సీలకు పార్టీ గెలుపు బాధ్యత అప్పగించారు. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రతి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఫలానా నియోజకవకర్గంలో ఎమ్యెల్యేకు టికెట్ రాదు.. ఇక్కడ అభ్యర్థిని మారుస్తున్నారంటూ చేసిన ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు దక్కాయి.
పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన నేతలను అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని క్యాంప్ కార్యాలయాలు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. మంత్రులను, ఎమ్మెల్యేలను అభినందించడానికి కార్యకర్తలు పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాలకు మొత్తం గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని కార్యకర్తలు ప్రతినబూనారు. టికెట్లు దక్కించుకున్న వారిలో ఈసారి ఇద్దరు బీసీలు, ఇద్దరు (రిజర్వ్డ్) దళితులున్నారు. దీంతో టికెట్లు దక్కించుకున్న వారంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలే కావడంతో విపక్షాలు ఖంగుతిన్నాయి. ఈ స్థానాలను తిరిగి దక్కించుకోవడానికి బీఆర్ఎస్ పక్కాగా స్కెచ్ వేసింది. బీఆర్ఎస్ టికెట్లు దక్కించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. భారీ ర్యాలీలతో నియోజకవర్గాల్లో అడుగుపెడుతున్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఏకంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. శనివారం నుంచి నియోజకవర్గంలో యాత్ర చేపట్టారు. మిగతా ఎమ్మెల్యేలు వారి ప్రచారానికి పదను పెడుతున్నారు. కారు జోరుమీద దూసుకెళ్తుంటే.. విపక్షాలు మాత్రం టికెట్ల లొల్లిలో పడ్డాయి. టికెట్లు ఎవరిని వరిస్తాయేమోనని టెన్షన్లో ఉన్నారు.
డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల పోరుకు బీఆర్ఎస్ ముందుగానే సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకున్నట్లే సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వడంతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీశ్రేణుల్లో జోష్ కనిపిస్తున్నది. ఊహించిన విధంగానే టికెట్లు దక్కడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ఎన్నికల వేటకు అవసరమైన అస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాల్లో ఏడు స్థానాల్లో బీఆర్ఎస్, ఐదు స్థానాల్లో కాంగ్రెస్, రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. 2018 వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. ఏకంగా 13 స్థానాల్లో బీఆర్ఎస్ పాగా వేసింది. ఒక్క కొల్లాపూర్ స్థానం చేజారింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో అన్ని స్థానాలు క్లీన్ స్విప్ అయ్యాయి. జిల్లాల పునర్విభజన కావడంతో ఐదు జిల్లాల్లో 12 స్థానాలు మిగిలాయి. ఈ స్థానాలను తిరిగి దక్కించుకోవడంపై పార్టీ ఫోకస్ పెట్టింది. పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నది. టికెట్ దక్కించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మళ్లీ విజయాన్ని సొంతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాగా మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జడ్చర్లలో లక్ష్మారెడ్డి, దేవరకద్రలో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణపేటలో రాజేందర్‌రెడ్డి, మక్తల్‌లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అచ్చంపేటలో గువ్వల బాలారాజు, నాగర్‌కర్నూల్‌లో మర్రి జనార్దన్‌రెడ్డి ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డి, గద్వాలలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్‌లో అబ్రహం, కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ రెండోసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు.
మహబూబ్‌నగర్ :
క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వరుసగా రెండుసార్లు గెలుపొందారు. గత ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీని సొంతం చేసుకున్నారు. ఈసారి టికెట్ లభించడంతో లక్ష మెజార్టీతో గెలుపు ఖాయమని కార్యకర్తలే చెబుతున్నారు. నియోజకవర్గాన్ని వేల కోట్లతో అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. ఐటీ టవర్‌ను ప్రారంభించి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన విషయంలో చొరవ తీసుకుంటున్నారు. విపక్షాల నుంచి బలమైన క్యాండెట్లు లేకపోవడం కలిసివచ్చే అంశం. కాంగ్రెస్‌లో ముగ్గురు టికెట్లు ఆశిస్తుండగా.. బీజేపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి.
వనపర్తి :
వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈసారి టికెట్ రావడంతో క్యాడర్లో ఫుల్‌జోష్ నెలకొన్నది. నిరంజన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యాక నియోజకవర్గ స్వరూపమే మారింది. జిల్లా కేంద్రం ఏర్పాటు కావడంతోపాటు ఊహించని రీతిలో ప్రగతి చేసి చూపించారు. ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రహదారుల విస్తరణ, ఏ నియోజకవర్గంలోని లేనివిధంగా అత్యధికంగా ఎత్తిపోతల పథకాలు చేపట్టి సాగునీటిని పారించారు. రెండోసారి మంత్రిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కార్యకర్తలే చెబుతున్నారు. కాంగ్రెస్‌లో గ్రూప్ తగాదాలు, టికెట్ల కోసం లొల్లి జరుగుతున్నది. బీజేపీలో టికెట్లు అడిగే నాథుడే లేకపోవడం కలిసిరానున్నది.
మక్తల్ :
సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి వరసగా రెండు సార్లు గెలిచారు. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ సాధించినట్లే. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో రెండో అతిపెద్ద మెజార్టీతో గెలిచి సత్తా చాటారు. భీమా ప్రాజెక్టుతో సాగునీళ్లను అందించడం, రైల్వేలైన్, జాతీయరహదారుల అనుసంధానం, 500 పడకల దవాఖాన, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. నిత్యం ప్రజల మధ్య ఉండే చిట్టెంకు విపక్షాల నుంచి బలమైన అభ్యర్థి లేకపోవడం కలిసివచ్చే అంశం. కాంగ్రెస్‌లో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య అరడజనుగా ఉన్నది. ఇక బీజేపీలో ఇద్దరు నేతలు టికెట్ల కోసం తన్నులాడుకుంటున్నారు. ఎవరికి టికెట్ వచ్చినా మరొకరు పార్టీకి ‘చేయి’ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
నారాయణపేట :
సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. 2018లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నారాయణపేట జిల్లా కేంద్రం కావాలనే చిరకాల వాం ఛను తెలిపి.. ఆ స్వప్నాన్ని సాకారం చేయించారు. ఊహించని విధంగా జిల్లాకేంద్రం అభివృద్ధి చేసి వరుసగా రెండుసార్లు గెలిచిన ఆయన ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాల ని కార్యకర్తలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌లో క్యాండెట్లు బలంగా లేకపోవడం, బీజేపీ ఓటుబ్యాంక్ 20 వేల ఓట్లలోపే ఉండొచ్చన్న అంచనాతో ఇక్కడ బీఆర్ఎస్ గెలుపు సులభం కావొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గద్వాల:
సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికే ఈసారి మళ్లీ టికెట్ వచ్చింది. 2018 ఎన్నికల్లో గెలిచి ఈసారి వరసగా రెండోసారి విజయాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. గద్వాల జిల్లా అభివృద్ధికి వందల కోట్ల నిధులు తీసుకొచ్చి జిల్లా కేంద్రం రూపురేఖలను మార్చివేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డాగా మార్చారు. 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన డీకే అరుణను ఓడించారు. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరి మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈసారి గద్వాలలో బీఆర్ఎస్ను ఢీకొనలేక నియోజకవర్గం మారుతుందన్న ప్రచారం జోరందుకున్నది. ఇక కాంగ్రెస్‌లో టికెట్ల కోసం సీనియర్లు, జూనియర్లు పోటీ పడుతున్నారు.
అలంపూర్ :
సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకే టికెట్ కేటాయించారు. పేదల డాక్టర్‌గా ఆయనకు పేరుంది. 70 ఏండ్లలో చేయని అభివృద్ధిని ఈ నాలుగున్నర ఏండ్లలో చేసి చూయించారు. వంద పడకల దవాఖాన, ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కాలువ ద్వారా వందల ఎకరాలకు నిరంతరం సాగునీరు పారించారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పోటీలో ఉండే అవకాశం ఉండగా.. బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారు. బీఎస్పీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీలో ఉండొచ్చు. ఇక్కడ రెండోసారి గెలుపు సునాయసమే అని పార్టీశ్రేణులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ చల్లావెంకట్రామారెడ్డి బీఆర్ఎస్కు అదనపు బలం.
అచ్చంపేట :
సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పోటీలో ఉన్నారు. వరుసగా రెండుసార్లు పోటీచేసిన గువ్వల ఈసారి తీన్మార్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. అచ్చంపేట ప్రజల చిరకాలవాంఛ ఉమామహేశ్వరం లిఫ్ట్‌ను సాధించారు. త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి వంశీకృష్ణ పోటీలో ఉండనుండగా.. క్యాడర్ నారాజ్‌లో ఉన్నట్లు సమాచారం. బీజేపీలో టికెట్ అడిగే నాథుడే లేడు.
నాగర్‌కర్నూల్ :
ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వరసగా రెండు సార్లు గెలిచి జోరుమీదున్నారు. మూడోసారి గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా కేంద్రంలో ఊహించని అభివృద్ధిని చూపించారు. వందల కోట్లతో ప్రగతి పరుగులు పెట్టిస్తున్నారు. సొంత ట్రస్ట్‌తో పెండ్లిండ్లు చేసి, అనేక సేవ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువయ్యారు. ఏదో కార్యక్రమంతో జనాల్లో ఉండే మర్రి ఈసారి పాదయాత్రతో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు టికెట్ కోసం పోటీ పడుతుండగా.. బీజేపీ నామామాత్రంగా ఉంది.
కల్వకుర్తి :
సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు టికెట్ ఇచ్చారు. ఈసారి గెలిస్తే వరసగా రెండోసారి గెలిచినట్లువుతుంది. పార్టీ ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డికి గెలుపు బాధ్యతలు అప్పగించినట్లు చర్చ జరుగుతుంది. ఈ నియోజకవకర్గంలోని నాలుగు మండలాలను రంగారెడ్డి జిల్లాలో విలీనం చేయడంతో హైదరాబాద్‌కు దగ్గరైంది. వ్యవసాయ భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. ఫార్మా సిటీ వస్తుండటంతో నియోజకవకర్గంలో ఊహించని అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున బీసీ క్యాండెట్ కావడం కలిసి వచ్చే అంశం.. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నది.
కొల్లాపూర్ :
సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ క్యాడర్ సంతోషంలో మునిగి తేలుతున్నది. టికెట్ వచ్చాక తొలిసారి వచ్చిన బీరానికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నాలుగున్నర ఏండ్లలో కొల్లాపూర్‌ను అభివృద్ధికి కేరాఫ్‌గా మార్చారు. కలగా ఉన్న సింగోటం రిజర్వాయర్‌ను చేసి సాగునీరు అందించారు. రహదారులు, భవనాలతో కొల్లాపూర్ రూపురేఖలే మార్చారు. ఉమ్మడి జిల్లాలో ఇక్కడే ఆసక్తికర పోటీ జరుగుతుంది. కాంగ్రెస్‌లోకి వెళ్లిన జూపల్లికి ఆ పార్టీలో మరో నేత టికెట్ రాకుండా అడ్డుపడుతున్నట్లు సమాచారం. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిస్తానని శపథం కూడా చేశాడట. బీజేపీ నుంచి నామామాత్రపు పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నది.
దేవరకద్ర :
సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికే టికెట్ కేటాయించడంతో క్యాడర్లో నూతానోత్సాహం నెలకొన్నది. నియోజకవకర్గంలో 30 చెక్‌డ్యామ్‌లు నిర్మించి సాగునీటిని అందించడంతో ఇటీవలే సీఎం కేసీఆర్ అభినందించారు. వందల కోట్లతో నియోజకవకర్గ అభివృద్ధి చేపట్టారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కింద కరివెన రిజర్వాయర్‌ను పూర్తి చేయించారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని దూకుడు ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్‌లో టికెట్ల కోసం యుద్ధం సాగుతుండగా.. నలుగురు టికెట్ కోసం కుస్తీలు పడ్తున్నారు. బీజేపీ నామమాత్రంగా ఉంది.
జడ్చర్ల :
సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డికి మళ్లీ కేసీఆర్ టికెట్ ఇచ్చారు. పారిశ్రామికం, వ్యాపార, వాణిజ్య కేంద్రమైన జడ్చర్లలో తొమ్మిదిన్నర ఏండ్ల కాలంలో వందల కోట్లతో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. వాగులపై వృథాగా పారే నీళ్లను చెక్‌డ్యాములు నిర్మించి ఒడిసి పట్టాలనే ఆలోచన చేసిందే లక్ష్మారెడ్డి. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న ఉదండాపూర్ రిజర్వాయర్ ఏకంగా 19 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నది. ఈ రిజర్వాయర్ నిండితే భూగర్భ జలాలు పెరిగి సాగు, తాగునీటికి ఢోకా ఉండదు. కాంగ్రెస్ నుంచి ముగ్గురు పోటీలో ఉండగా.. ఎవరికి టికెట్ వచ్చినా మిగతా వారు మౌనంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఇది బీఆర్ఎస్కు కలిసివచ్చే అంశం. బీజేపీ మాత్రం నామామాత్రంగానే పోటీ ఇచ్చే అవకాశం ఉన్నది.