నాగర్‌కర్నూల్/తాడూరు, డిసెంబర్ 8 : నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌ను స్థానిక సంస్థల ఎన్నికల్లో బొందపెట్టాలని, ఓటు అడగడానికి వచ్చే అధికార పార్టీ నాయకులను గ్యారెంటీలపై నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం తెలకపల్లి మండలం పెద్దపల్లిలో గులాబీ పార్టీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి జయరాం (బ్యాట్ గుర్తు)కు, తాడూరు మండల కేంద్రంలో బలపరిచిన అభ్యర్థి కోళ్ల రమేశ్ గెలుపునకు ఆయన ప్రచారం నిర్వహించారు. రెండు గ్రామాల్లో పార్టీశ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. అడుగడుగునా మర్రికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలాగే తాడూరు మండల కేంద్రంతోపాటు అల్లాపూర్, గుంతకోడూరు, ఇంద్రకల్, మేడిపూర్ గ్రామాల్లో పార్టీ మద్దతు సర్పంచ్, వార్డు అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల గెలుపునకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిబద్దతతో పని చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాలన్నారు. అమలు కానీ హామీలు గుప్తిస్తూ, కల్లబొల్లి మాయమాటలతో ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు. ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఇప్పటికీ మహిళలకు రూ.2,500 నగదు ఇవ్వలేదని, రైతు రుణమాఫీ ఆగమాగం చేశారని, పత్తి, వరికి ధరలు లేవని, సన్న వడ్లకు బోనస్ ఎత్తేశారని, రైతు భరోసా రెండు విడుతలు పెండింగ్ ఉందని మండిపడ్డారు. ఉచిత బస్సును ఒక్కటే అమలు చేస్తున్నామని చెబుతున్నా.. బస్సుల్లో మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారని విమర్శించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడలేదన్నారు.
కానీ కాంగ్రెస్ పాలనలో ఈఏడాది నరకం చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఓటేసే ముందు రేవంత్ పాలనలో జరిగిన అన్యాయాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. పల్లెలోల వీధిలైట్లు కాలిపోతే తెప్పించే పరిస్థితి నేడు లేదని, తడి, పొడి చెత్తను సేకరించేందుకు జీపీకి ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు మూలన పడేశారని దుయ్యబట్టారు. జీపీ సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అభివృద్ధి మల్లా జరగాలంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిపించాలన్నారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు సమద్‌పాషా, రమణ, పర్వతాలు, మశన్న, ప్రసాద్, బాలకృష్ణ, కృష్ణయ్యతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.