వనపర్తి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ నేతలు రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా గోపాల్పేట సర్పంచ్‌గా నామినేషన్ వేసిన స్వప్న ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ మండల పార్టీకి చెందిన సత్యశీలారెడ్డి, ఎమ్మెల్యే ప్రోత్సాహంతో తన కుటుంబాన్ని రాజకీయ ఒత్తిడికి గురిచేస్తూ ఇబ్బందులు కల్పిస్తున్నాడని శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి మల్లయ్య దృష్టికి తీసుకెళ్లింది. గోపాల్పేట సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయించడంతో దళిత సామాజిక వర్గానికి చెందిన స్వప్న నామినేషన్ వేయడంతో కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వాపోయింది.
తన భర్త భాస్క ర్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్నాడని, అయితే అతడికి ఫోన్ చేసి తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించింది. లేదంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలని వేధిస్తున్నారని ఆవేదన చెందింది. లేదంటే తన భర్తపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారని, గోపాల్‌పేటలో అడుగు పెట్టవద్దని హుకూం జారీ చేస్తున్నారని తెలిపింది. లోకల్ బాడీ ఎన్నికలు ప్రక్రియ ప్రారంభం నుంచి అనవసరంగా జోక్యం చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కరుణశ్రీ, నాయకులు నందిమల్ల అశోక్, కర్రెస్వామి, వెంకటేశ్, మాణిక్యం, వేణు, ఖాదర్, రహీం, నీలస్వామి, హుస్సేన్, జమీల్, మహేశ్వర్‌రెడ్డి, అలీం ఉన్నారు.