వనపర్తి టౌన్, జనవరి 14 : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భోగి పండుగను జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. జంగిడిపురం, వెంగల్రావు కాలనీ, గాంధీచౌక్, పాతబజార్ తదితర కాలనీల్లో భోగి మంటలు వేశారు. వేకువజాము నుంచే మహిళలు తమ వాకిళ్లను శుభ్రపర్చుకొని రంగురంగుల ముగ్గులు వేశారు. సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేస్తూ పతంగులు, ముగ్గులు వేసి పండుగను నిర్వహించుకున్నారు. ప్రతి ఇంటా నువ్వులతో జొన్నరొట్టెలు చేసుకొని ఆరగించారు.
వనపర్తి, జనవరి 14 : వనపర్తి పట్టణం , మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం భోగి పండుగ పురస్కరించుకొని ఆయా గ్రామాల్లో తెల్లవారుజామున భోగి మంటల వేశారు. పట్టణంలోని పాత మార్కెట్ ఆవరణలో బాలాజీ సెలబ్రేషన్ టీం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు.
కొత్తకోట, జనవరి 14 : సంక్రాంతి సంబురాలను పట్టణంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించుకొన్నారు. ముందుగా గ్రామంలో భోగి మంటలు వేశారు. అలాగే మహిళలు ఇండ్ల ఎదుట ముగ్గులను వేసి గొబ్బెమ్మలను పెట్టారు. మండలంలోని రామకృష్ణాపురంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. మొదటి బహుమతి చందనకు, రెండో బహుమతి స్వాతి, మూడో బహుమతి గాయత్రి, నాలుగో బహుమతి గాయత్రీకి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లత, జయరాములు, వెంకటయ్య, నర్సింహ, చంద్రమౌళి, కృష్ణయ్య, నర్సింహ, చాంద్‌పాషా, మహేశ్, రామకృష్ణ పాల్గొన్నారు.
అమరచింత, జనవరి 14 : సంక్రాంతి పండుగ సందర్భంగా మూడురోజులపాటు విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని జెడ్పీ పాఠశాల ఆవరణలో యువతీ, యువకులకు ఆటల పోటీలను నిర్వహిస్తున్నామని ఎస్ ఎఫ్ఐ విద్యార్థి సంఘం, డీవైఎఫ్ఐ యువజన సంఘాల నాయకులు రాఘవ, వెంకటేశ్ తెలిపారు. ఆదివారం వారు పాఠశాల ఆవరణలో ఆయా సంఘాల జెండాలను అవిష్కరించి కబడ్డీ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. వాలీబాల్, ఖోఖోతోపాటు పాటల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన యువత తమ పేర్లను స్థానికంగా ఉన్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులకు తెలియజేయాలన్నారు.
మల్దకల్, జనవరి 14 : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆదివారం మండలకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో పిల్లలు, పెద్దలు భోగి పండుగను ఘనంగా నిర్వహించకున్నారు. ఈ సందర్భంగా మహిళలు తెల్లవారు జూమునే ఇళ్ల ముందు ముగ్గులు వేశారు. వేసిన ముగ్గులకు రంగులు అద్ది అందంగా తీర్చి దిద్దారు. ముగ్గుల మధ్యలో పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలు పెట్టి మహిళలు, చిన్నారులు పూలు చల్లి, ప్రత్యేక పూజలు చేశారు. భోగి పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో నువ్వుల రొట్టెలను, పులుగంను వండి భోజనాలు చేశారు.
గద్వాల, జనవరి 14 : జిల్లాలో సంక్రాంతి సంబురం మొదలైంది.ఆదివారం భోగి పండుగ కావడంతో భోగి మంటలు వేసుకోవడంతో గ్రామాలతోపాటు పట్టణంలో పండుగ శోభ సంతరించుకున్నది. మహిళలు ఉదయాన్నే లేచి ఇల్ల్లు శుభ్రపర్చుకొని ఇంటి ఎదుట రంగు రంగుల ముగ్గులువేశారు. ఏ విధిలో చూసినా రంగ వల్లులతో నిండి భోగిని ప్రజలు భోగ భాగ్యాలతో నిర్వహించుకున్నారు
ఉండవెల్లి, జనవరి 14: మండలంలోని తక్కశిల, ప్రాగటూర్, మారమునగాల, శేరుపల్లి, కంచుపాడు, చిన్న ఆముదాలపాడు, ఉండవెల్లి, బైరాపురం, బస్వాపురం, బొంకూర్, పుల్లూరు, కలుగొట్ల, మెన్నిపాడు, ఇటిక్యాలపాడులో భోగి పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. లోగిళ్లను రంగురంగుల ముగ్గులతో ఆలకరించుకొని తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసుకుని సందడి చేశారు. నువ్వుల రొట్టెలు, కలగూరలతో చేసిన వంట, పులగంతో భోజనం చేశారు.
అయిజ, జనవరి 14: మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివారం భోగి సంబురాలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానాలు చేసి ఇంటి ముందు ముగ్గులతోపాటు గొబ్బెమ్మలు భక్తిశ్రద్ధలతో పూజించారు. పిల్లాపాపలతో పిండి వంటలు వండుకు న్నారు.
గట్టు, జనవరి 14 : మండలకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో సంక్రాంతి సంబురాల్లో భాగంగా భోగి పండుగను ప్రజలు ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు తమ ఇళ్ల ముంగిట అందమైన ముగ్గులను వేసి వాటి మధ్య గొబ్బెమ్మలను పెట్టారు. పండుగ సందర్భంగా ఆలయాల్లో పూజలు చేశారు. నువ్వుల సజ్జ రొట్టెలు, కలకూరగాయాలతో వండిన వంటకాన్ని ఆరగించారు.
ధరూరు, జనవరి 14 : భోగి పండుగ వేడుకలను మండలంలోని ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు తమ ఇంటి ముంగిట రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు.
గోపాల్పేట, జనవరి 14 : సంక్రాంతి పండుగ సందర్బంగా మండలకేంద్రంలోని కోందడరామస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మండల కేంద్రానికి చెందిన 39జంటల చొప్పున మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు. మొదటి బహుమతి అరుణశ్రీ, శ్రీలతలకు రూ. 3వేలు, రెండో బహుమతి చంద్రకళ, శిరీషకు రూ. 2 వేలు, మూడో బహుమతి మానస, హరితలకు రూ. 1,000 నగదు అందజేయగా, కన్సూలేషన్ కింద పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నోట్ బుక్, పెన్నులు సర్పంచ్ శ్రీనివాసులు, ప్రకాశ్‌శెట్టి అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, కాశీనాథ్ పాల్గొన్నారు.
ఆత్మకూరు, జనవరి 14 : భోగి పండుగ సందర్భంగా ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల్లో, మున్సిపాలిటీల్లోని వివిధ కాలనీల్లో భోగి మంటలను వేసుకున్నారు. తెల్లవారుజామున మహిళలు ముగ్గులు వేసి నేలతల్లిని శోభితం చేశారు. ముగ్గుల్లో గొబ్బెలను పెట్టి పూజలు చేశారు. ప్రతి ఇంట్లో సజ్జ పిండితో చేసిన నూగుల రొట్టెలు, పిండి వంటకాలతో విందును ఆరగించారు.
పాన్‌గల్, జనవరి14 : మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలు ఆదివారం భోగి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు వేకువజామున లేచి ఇంటి ముంగిళ్లలో రకరకాల ముగ్గులు వేశారు. అనంతరం నువ్వులతో తయారు చేసిన రొట్టెలను ఆరగించారు. అదేవిధంగా మండలకేంద్రంతోపాటు కేతేపల్లి, దావత్కాన్‌పల్లి, జమ్మాపూర్, రేమద్దుల, తెల్లరాళ్లపల్లి తదితర గ్రామాల్లో వివిధ క్రీడాపోటీలను నిర్వహించారు.
అయిజ రూరల్, జనవరి14: మండలంలోని సంకాపురం, ఈడిగోనిపల్లి, వేణిసోంపురం, కేశవరం, చిన్నతాండ్రపాడు, బింగిదొడ్డి, ఎక్లాస్పురం, దేవబండ, వెంకటాపురం, యాపదిన్నె తదితర గ్రామాల్లో ఆదివారం భోగి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. వేకువజామున మహిళలు తలంటు స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసి లోగిళ్ల ముంగిట ముగ్గులను వేసి అలంకరించారు. హరిదాసులకు నవధాన్యాలను ధానం చేశారు. అనంతరం ఒకరికొకరూ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.