మీరు పట్టుకుంటారా.. మమ్మల్ని పట్టించమంటారా…?
ప్రభుత్వ ఆదాయంకు గండి.. అధికారుల కళ్ళకు గంతలు
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అక్రమాలకు అడ్డు అదుపు లేదు
Jogulamba Gadwal | అలంపూర్, జూన్ 23: అలంపూర్ ఏరియాలో రోజురోజుకు మాఫియా రెచ్చిపోతుంది. ఎటువంటి అనుమతులు లేకున్నా మట్టి తరలింపులు.. ఇసుక తరలింపులు యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇవేమి సంబంధిత అధికారులకు కనిపించడం లేదు. ఏడాది క్రితం కల్లబొల్లి మాటలు చెప్పి అమలుకు వీలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏటు పాలు పోక అక్రమాలకు తెరలేపింది. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు సైతం ప్రజల కష్టసుఖాలు, న్యాయ అన్యాయాలు ఆలోచించకుండా అధికార పార్టీ నాయకుల వైపే మొగ్గు చూపుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్..
ఇదిలా ఉండగా ఆయా గ్రామాల్లో యువత సిటిజెన్లు అక్రమ మట్టి తరలింపు ఇసుక తరలింపు ఫోటోలు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఫార్వర్డ్ చేస్తున్నారు. మాఫియా దందా… కోన్ ఆఫ్ కరేగా అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం ఒక్కటంటే ఒక్క కేసు కూడా కట్టడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. కొంతమంది అధికార పార్టీ ముసుగులో ఉంటూ అక్రమ దందాలకు తెరలేపినట్లు ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. తాజాగా అలంపూర్ మండలం ర్యాలంపాడు, సుల్తానాపురం గ్రామాల శివారులో ప్రభుత్వ భూములైన గుట్ట నుండి రాత్రుల సమయంలో ఎర్రమటి తరలింపు తుంగభద్రా నది నుండి ఇసుక తరలింపు మండల పరిధిలోని ఆయా గ్రామాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత శాఖ అధికారులకు విషయం తెలియజేసిన వినివిననట్లు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కోసారి ఫిర్యాదుదారులపై ఉల్టా కేసులు పెడతామని పోలీసులు బెదిరించిన సందర్భాలు కూడా లేకపోలేదు. 44వ జాతీయ రహదారిపై రాత్రి అయిందంటే రాకెట్ వేగంతో ఇసుక ట్రాక్టర్లు పరుగులు తీస్తున్న విషయాలు అధికారులకు చేరవేసిన అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు వస్తున్నాయి. రాత్రుల సమయాల్లో జాతీయ రహదారిపై సుమారు రెండు మూడు పోలీస్ వాహనాలు స్థానిక స్టేషన్ బ్లూ కోర్ట్ సిబ్బంది పెట్రోలింగ్ వాహనాలు నిరవధికంగా గస్తీలు తిరుగుతున్నప్పటికీ వారికి ఒక్క ఇసుక ట్రాక్టర్ కూడా కంటపడటం లేదని చెప్పడం విడ్డూరమే. ఒక్క బండిపై కూడా నేటి వరకు కేసులు కట్టలేక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణాల్లో, గ్రామాల్లో రోడ్లపై ప్రధాన సర్కిల్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా సిబ్బంది మాదిరిగానే అవి కూడా రాత్రి పగలు అనే తేడా లేకుండా నిద్దరోతున్నాయని ప్రజలు గుసగుసలాడుతున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
ఏ అభివృద్ధి పనులకైనా ఇసుక, ఎర్రమట్టి అవసరమైతే సాధారణంగా సంబంధిత శాఖ నుండి ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతులు మంజూరవుతాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయా ప్రాంతాల్లో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఇసుక తరలించాలంటే ప్రభుత్వ అనుమతులు అక్కర్లేదు, అధికార పార్టీ ఉన్నత స్థాయి నాయకుడిని ప్రసన్నం చేసుకుంటే చాలు అనే నానుడి బలంగా ఉంది. అధికార పార్టీ నాయకుడి కను సన్నల్లోనే అధికారులు విధులు నిర్వహిస్తున్న ఆయా శాఖల అధికారులు మాఫియా దందా సాఫీగా కొనసాగడానికి మరీ దగ్గరుండి అవసరమైన సలహాలు సూచనలు అందిస్తున్నట్లు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక మైనింగ్ శాఖ అధికారులైతే తమకేమీ పట్టనట్లు ఆ శాఖ మాది కాదు అన్నట్లు ప్రశాంతంగా జిల్లా కేంద్రం కార్యాలయాల్లోని ఉంటున్నారు. నేటివరకు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించిన దాఖలాలు లేవు. మైనింగ్ శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖలు ఉమ్మడిగా నిఘాను పెంచి అక్రమ మైనింగ్ ను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మీరు పట్టుకుంటారా.. మమ్మల్ని పట్టించమంటారా..? : బీఆర్ఎస్ నేత మహేష్
మండల పరిధిలోని సుల్తానాపురం, రాలంపాడు గ్రామ శివారులో సర్వేనెంబర్ 29, 30, 79 ర్యాలంపాడు సుల్తానాపురం గ్రామ శివారులో ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి సమయాల్లో మట్టిని యంత్రాలతో తోడుతూ ట్రాక్టర్లు, టిప్పర్లు సహాయంతో తరలిస్తున్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినప్పటికీ ఏ ఒక్క శాఖ అధికారి కూడా స్పందించడం లేదు. అవసరమైన అన్ని ఆధారాలతో ఫోటోలు, వీడియోలు పోస్టులు ఫార్వర్డ్ అవుతుంటే అధికారులకు తెలిసిన తెలియనట్లు ప్రవర్తిస్తున్నారు. బాధ్యతాయుతమైన అధికారిక విధుల్లో ఉంటూ అక్రమ దందాలను అడ్డుకునే శక్తి మీకు లేకుంటే చెప్పండి ,మేమే ఫీల్డ్ లోకి దిగి అక్రమ దందాకు పాల్పడే మాఫియాను పట్టిస్తాం.. అప్పుడైనా కేసులు కట్టే దమ్ము ఆయా శాఖల అధికారులకు ఉందా.? అక్రమాలకు అన్యాయాలను అరికట్టడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు అనుమతులు ఉన్న ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడలేక పోతే ప్రభుత్వ వేతనాలు తీసుకోవడం ఎందుకు..? సోయి ఉండాలే.
సిబ్బందిని కాపలా పెట్టాం : మంజుల, అలంపూర్ తాసిల్దార్
మండల పరిధిలోని సుల్తానాపురం ర్యాలంపాడు గ్రామ శివారులలో మట్టి తరలింపుపై నిఘా పెంచాం. గత రెండు మూడు రోజులుగా పగటిపూట సిబ్బందిని కాపలా ఉంచుతున్నాం. మా పరిధిలో మేము మాఫియాని అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం. రాత్రుల సమయాల్లో తరలించకపోతున్నట్టు సమాచారం .మైనింగ్ శాఖ పోలీస్ శాఖ అధికారులు కూడా ఈ విషయంలో చొరవచూపాలి.
దొరికితే కేసులు పెడతాం : రవి బాబు, అలంపూర్ సీఐ
అలంపూర్ సర్కిల్ పరిధిలో అక్రమ దందాలను అరికడుతున్నాం. రాత్రుల సమయాల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తాం. ఎవరైనా అక్రమ దందాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అక్రమంగా ఎర్రమట్టిని, ఇసుకను తరలిస్తున్న మెసేజ్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం నా దృష్టికి వచ్చింది. అక్రమార్కులకు సహకరించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి అట్టి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ అధికారులు ఎవరైనా పార్టీల కతీతంగా విధులు నిర్వహిస్తారు. అక్రమాలకు పడినవారు ఎవరైనా ఆధారాలతో దొరికితే చట్టపరమైన కేసులు పెడుతాం.