ఆర్టీసీ.. ప్రజారవాణా పేరిట సేవ చేస్తున్న సంస్థగా పేరు గడించింది. అలాంటి సంస్థ దసరా సందర్భంగా అదనపు చార్జీలతో పేదల జేబులకు చిల్లులు పెడుతున్నది. ముఖ్యంగా నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ రూట్లో ప్రయాణికులు తేరుకునేలోగా టికెట్ చేతుల్లో పెట్టి పెంచిన ధరలను వసూలు చేయడం గమనార్హం. ఒకటే సారి రూ.వందల్లో ధరలు పెంచడంతో ప్రయాణికులు అవాక్కవుతున్నారు. ఉచితం పేరిట మహిళలకు అందిస్తున్న ప్రయాణ భారాన్ని పేదలపై రుద్దేందుకు ప్రభుత్వం ఆర్టీసీని ఎంచుకున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
– నాగర్‌కర్నూల్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ)
పేదలకు దసరా పండుగ సంబురాన్ని తెస్తే.. ఆర్టీసీకి ఆదాయాన్ని తీసుకొచ్చింది. ఇదేదో ప్రయాణికులు అధికంగా ఎక్కడం వల్ల వచ్చింది కాదండి. అదనపు చార్జీలతో ముక్కుపిండి వసూలు చేశారు. పండుగ వేళ నాగర్‌కర్నూల్ నుంచి హైదరాబాద్.., హైదరాబాద్ నుంచి నాగర్‌కర్నూల్‌కు వచ్చే బస్సుల్లో ఆర్టీసీ యాజమాన్యం ఊహించని స్థాయిలో టికెట్ల రేట్లను పెంచింది. సూపర్ లగ్జరీ బస్సులో సాధారణ రోజుల్లో హైదరాబాద్‌కు రూ.220 ఉండగా.. పండుగ వేళ ఏకంగా రూ.140 పెంచి రూ.360 చొప్పున వసూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సులో రూ.180 ఉండగా.. ప్రత్యేక బస్సు పేరిట ఇప్పుడు రూ.260కి చేరుకున్నది.
దాదాపుగా రూ.80 పెంచడం విస్మయం కలిగిస్తున్నది. ఇదిలా ఉండగా, బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆర్టీసీ అధికారులు పేరుకే చెబుతున్నా.. పూర్తిస్థాయిలో సమాచారం మాత్రం ఇవ్వడం లేదు. ఇక హైదరాబాద్‌లో తిరిగే సిటీ బస్సులను సైతం నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ వంటి ప్రాంతాలకు నడిపిస్తున్నారు. దసరా ముందు రోజు నుంచి సోమవారం వరకు ఆర్టీసీ సంస్థ ఇలా అదనపు చార్జీలను వసూలు చేయడంతో పేదలపై మోయలేనంత భారం పడింది.
ముందస్తు సమాచారం లేకుండా టికెట్ల ధరలు పెంచడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పండుగ కోసం ఊళ్లకు వచ్చే, తిరిగి వెళ్లే ప్రజలకు ఆర్టీసీ చుక్కలు చూపించింది. బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాక చార్జీని చూసిన చాలా మంది కంగుతిన్నారు. ఇదేమిటని అడిగితే దసరా స్పెషల్ బస్సులంటూ కండక్టర్లు, డ్రైవర్లు సమాధానమివ్వడం ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పుడైనా జాతరలు, సుదూర పర్యాటక ప్రాంతాలకు వేసే ప్రత్యేక బస్సుల్లో ఇలా చార్జీలు పెంచడం సాధారణంగా చూస్తుంటాం.
సాధారణంగా హైదరాబాద్-నాగర్‌కర్నూల్ రూట్లో దసరా స్పెషల్ అంటూ చార్జీలు వసూలు చేయడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని డిపోల నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులకు కాగితాలను అతికించి దసరా స్పెషల్ అంటూ రాశారు. బస్సులు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో టికెట్లు దొరకక నిలబడి వెళ్తుండడం కనిపించింది. ఇక బస్టాండ్లలో సీట్ల కోసం ప్రయాణికులు ఒక్కసారిగా బస్సుల వైపు ప్రమాదకరంగా పరుగెత్తడం ఆందోళన కలిగిస్తున్నది. ఆర్టీసీ సంస్థకు ఆదాయం పెంచే ఆలోచన బాగున్నా.. పేదల సంక్షేమాన్ని విస్మరించింది.
బస్సులను అదనంగా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఉచిత ప్రయాణం అంటున్న ప్రభుత్వం.. దసరా పేరిట ప్రైవేట్ ట్రావెల్స్ మాదిరిగా సేవకు బదులు ఆదాయ రాబడి తీసుకొచ్చేలా వ్యవహరించడం విడ్డూరంగా ప్రజలు అభివర్ణిస్తున్నారు. కాగా, ప్రయాణికులు దిగేందుకు, ఎక్కేందుకు స్టాప్‌లలో, గ్రామాలకు వెళ్లే రోడ్లపై బస్సులను ఆపడంలేదు. మండల కేంద్రాలు, స్టాపుల్లోనే బస్సులు ఆపుతామంటూ డ్రైవర్లు, కండక్టర్లు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఆదాయం కోసం ఆర్టీసీ సంస్థ పండుగ వేళ టికెట్ రేట్లను పెంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అచ్చంపేటటౌన్, అక్టోబర్ 14 : అదనపు చార్జీలతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. పండుగను సొంత ఊరిలో జరుపుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రజలు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ఆర్టీసీ సంస్థ అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు ఏకంగా రూ.110 పెంచింది. గతంలో ఈ రూట్లో టికెట్ ధర రూ.210 ఉండగా.. ప్రస్తుతం స్పెషల్ బస్సుల పేరిట రూ.330 వసూలు చేస్తున్నదని ప్రయాణికులు వాపోతున్నారు. అలాగే డిపోలో బస్సులు లేక పిల్లలు, పెద్దలు, విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొల్లాపూర్, అక్టోబర్ 14 : కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ బస్సుల పేరిట చార్జీలను పెంచి సామాన్యుల నడ్డీ విరుస్తోందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆగ్రహం చెందారు. కొల్లాపూర్ నుంచి జీవనోపాధికి, పనుల నిమి త్తం చాలా మంది హైదరాబా ద్ వె ళ్తుంటారని, అలాంటి వారికి బస్సు చార్జీ లు గుదిబండగా మారాయన్నారు. కొల్లాపూర్ నుంచి హైదరాబాద్‌కు రూ. 360 చార్జీ చేయడమంటే.. పేదలకు ఆర్టీసీ సేవలను దూరం చేయడమేనన్నారు. బస్సు చార్జీల పెంపుదలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.
ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణికులు ఎక్కువగా ఉంటారని సూపర్ లగ్జరీ బస్సుల్లో హైదరాబాద్‌కు వెళ్తుంటాను. ఈ రోజు అదే బస్సు ఎక్కితే రూ.220 టికెట్ బదులుగా రూ.360 తీసుకున్నారు. ఇదేమిటని అడిగితే దసరా స్పెషల్ అని చెబుతున్నారు. పండుగ సందర్భంగా ఆర్టీసీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్
మాదిరి చార్జీలు పెంచడం సరికాదు. ఏ మాత్రం సమాచారం లేకుండా ఇలా టికెట్ల రేట్లు పెంచడం బాగాలేదు.
– సురేష్, ప్రయాణికుడు