మానవపాడు, ఏప్రిల్ 17 : 20ఏండ్లుగా దుకాణాలు నడుపుకొంటున్నాం.. సడన్‌గా వచ్చి చిరువ్యాపారాలు చేసుకునే మా డబ్బాలు జేసీబీలతో తొలగించడం సరికాదని చిరు వ్యాపారులు వాపోయారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అద్దె చెల్లించడం లేదని పోలీసులు, జేసీబీ సహకారంతో రెండు డబ్బాలను తొలగించగా, విషయం తెలుసుకున్న వ్యాపారులు ఘటనా స్థలానికి చేరుకొని అడ్డుకున్నారు.
20 ఏండ్లుగా డబ్బాలను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు సాగిస్తున్నామని, ఎ లాంటి నోటీసులు ఇవ్వకుండా ఇష్టానుసారంగా డబ్బాలు తొలగిస్తామంటే సహించేది లేదన్నారు. 10 మంది వరకు డీడీలు కట్టామని, అనుమతులు తీసుకున్న డబ్బాలను తొలగించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
దీంతో అధికారులు, వ్యాపారులను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. ఇందుకు వ్యాపారులు మాట్లాడుతూ తాము అద్దె చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని, స్థలం కేటాయించాలన్నారు. ఇందుకు కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అధికారులు హామీ ఇ చ్చారు. కాగా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా డబ్బాలను ధ్వంసం చేశారని నాగరాజు, కిషన్ ఆర్టీసీ అధికారులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ధ్వంసం చేసిన డబ్బాలకు ఆర్టీసీ అధికారులు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.