మానవపాడు, నవంబర్ 13 : అయిజ నుంచి కర్నూల్‌కు వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఓవర్‌లోడ్ కారణంగా బస్సు బాడి టైర్లకు రాసుకోవడంతో మంటలు చెలరేగడం గుర్తించి డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం అయిజ నుంచి కర్నూల్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సుమారు 130మంది ప్రయాణికులతో కర్నూల్‌కు బయలుదేరింది. మార్గమధ్యంలో మానవపాడు మండల పరిధిలోని మద్దూరు స్టేజి దగ్గరకు రాగానే బస్సుకు మంటలు వ్యాపించాయి. అది గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు.
దీంతో అప్రమత్తమైన డ్రైవర్ సత్యారెడ్డి బస్సును నిలిపి వేశారు. ప్రయాణీకులు ప్రాణ భయంతో బస్సు నుంచి బయటకు పరుగులు తీశారు. డ్రైవర్ బస్సులో ఉన్న సీవో-2 సిలిండర్‌ను తీసుకొచ్చి మంటలు వ్యాపించిన ప్రాంతాన్ని గుర్తించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులతోపాటు పంట పొలాల్లో ఉన్న మద్దూరు గ్రామస్తులు బిందెలు తీసుకొచ్చి పక్కనే ఉన్న ఆర్డీఎస్ కాల్వ నీటిని తీసుకొచ్చి మంటలు ఆర్పి వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మంటలు ఎలా వ్యాపించాయని విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఆర్టీసీ బస్సులో కెపాసిటీకి మించి అదికంగా 130 మంది ప్రయాణికులు ఎక్కడం వల్లె బస్సు బాడి టైర్లకు రాసుకుని మంటలు చెలరేగి ఉంటాయని బస్సు డ్రైవర్ సత్యారెడ్డి అన్నారు. ఫ్రీ బస్సు ఉండడంతో మహిళలు కూడా అధిక సంఖ్యలో ఎక్కుతున్నారు. వద్దంటే మాపై ఫిర్యాదు చేస్తారని, ఇలాంటి సంఘటనలు జరిగితే డ్రైవర్ తప్పిదం వల్లే జరిగిందని నిందలు వేస్తారని డ్రైవర్ అన్నారు. మద్దూరు గ్రామస్తులు, ప్రయాణికుల సహకారం వల్ల పెను ప్రమాదం తప్పిందని డ్రైవర్ పేర్కొన్నారు.