నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 20 : దసరా పండుగ పూట ప్రజలకు ఆర్టీసీ అదనపు చార్జీల పేరిట షాకిచ్చింది. ప్రత్యేక బస్సుల పేరుతో 50శాతం అదనంగా వసూలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బతుకమ్మ, దస రా, దీపావళి పండుగలకు హైదరాబాద్‌తోపాటు సుదూ ర ప్రాంతాల నుంచి పల్లెలకు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వగ్రామాలకు తరలి వస్తారు. ఇదే అదనుగా భావించిన ఆర్టీసీ ఉన్న చార్జీల్లో 50శాతం అదనంగా పెంచి వసూళ్లు చేస్తున్నది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు గతంలో సూపర్ లగ్జరీ బస్సుకు రూ.220 టికెట్ ధర ఉండగా, ప్రస్తుతం అదనపు చార్జీ ల పేరిట రూ.290 వసూలు చేస్తున్నారు.
అలాగే నాగర్‌కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు రూ.180 బస్సు టికెట్కుగానూ ఏకంగా రూ.100 పెంచి రూ.280 వసూలు చేస్తున్నారు. ఇదే మాదిరిగా కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లోనూ అదనంగా వసూలు చేస్తున్నారు. ఓ వైపు మహిళలకు ఉచిత బస్సులు నడిపిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు పురుషులతో అంతకు రెట్టింపు చార్జీలు వసూలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ సిబ్బందిని నిలదీసినట్లు తెలిసింది. చాలా మంది పేద లు చార్జీలకు సరిపడా డబ్బులు తీసుకొని బస్సులు ఎక్కుతుండగా.. ఇది ప్రత్యేక బస్సు అంటూ అదనపు చార్జీలు దర్జాగా వసూలు చేస్తుండడంతో ప్రభుత్వంపై, ఆర్టీసీ యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రయాణికుల అవకాశాన్ని ఆసరాగా చేసుకొని పల్లెల్లోకి నడిపి పల్లె వెలుగు బస్సులను సైతం స్పెషల్ బస్సుల పేరిట బోర్డులు పెట్టి పల్లెల నుంచి పట్నానికి నడిపిస్తున్నారు. ఈ విషయమై ఆర్టీసీ అధికారులను వివరణ కో రగా, ప్రత్యేక బస్సుల్లో మాత్రమే అధిక చార్జీలు వసూ లు చేస్తున్నామని, 2003 నుంచి ప్రత్యేక బస్సుల్లో 16 జీవో ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చార్జీలను సవరించినట్లు పేర్కొంటున్నారు. ఏదేమైనా ప్రతి సంవత్సరం పండుగ సమయంలోనే బస్‌చార్జీలు పెంచ డం, ప్రజలు, ప్రయాణికుల అవసరాన్ని ఆసరగా చేసుకొని అక్రమంగా అదనపు చార్జీలు దండుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పేరుకే జిల్లా కేంద్రమైన నాగర్‌కర్నూల్‌కు రాత్రయితే చాలు బస్సులు లేవని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి చివరి బస్సు రాత్రి 10 గంటలకు రావాల్సి ఉండగా.. సిబ్బంది ఇష్టానుసారం.. టైమ్ పాటించకుండా నడుపుతున్నారు. లాస్ట్ బస్సు త్వరగా వెళ్తుండడంతో గంటల తరబడిపడిగాపులు తప్పడం లేదని వాపోతున్నారు.
రాత్రి 11 గంటలకు బయలుదేరే కొల్లాపూర్ బస్సే దిక్కని.. ఈ బస్సు కూడా కెపాసిటీకి మించి ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఓవైపు జిల్లా కేంద్రం ఉన్నా నాగర్‌కర్నూల్‌కు.. మరోవైపు మంత్రి ఇలాకా అయిన కొల్లాపూర్‌కు బస్సులు సరిపడా లేక రాత్రివేళ నిరీక్షణ.. జాగారం తప్పడం లేదని పలువురు ఆవేదన చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమయానుకూలంగా బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
నారాయణపేట రూరల్, సెప్టెంబర్ 20 : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బస్సు రేట్లు పెరిగినయ్ ఉయ్యాలో.. అనేలా ఆర్టీసీ వ్యవహరిస్తున్నది. పెరిగిన బస్సు చార్జీలను చూసి జనం ఆందోళనలకు గురువుతున్నారు. శనివారం మధ్యాహ్నం నారాయణపేట డిపోకు చెందిన సూపర్ లగ్జరీలో మహబూబ్‌నగర్‌కు రూ.130 చార్జీ ఉండగా, రూ.200, హైదరాబాద్‌కు రూ.320 ఉండగా, రూ.440 చార్జీలు వసూలు చేశారు. దీంతో ప్రయాణికులు అభ్యంతరం చెప్పారు. హైదరాబాద్ వెళ్లే బస్సు బయలుదేరుతుండగా ప్రయాణికులు అదనపు చార్జీలపై అభ్యంతరం చెప్పారు. ప్లాట్ ఫాం నుంచి కదిలిన బస్సును డ్రైవర్ మళ్లీ వెనక్కి తీసుకొచ్చాడు.
డిపోలో అధికారులకు డ్రైవర్ వివరించగా, పాత ధరల చార్జీలతో ట్రిమ్‌ను రివైజ్ చేసుకొని వచ్చాడు. మళ్లీ యథావిధిగా మహబూబ్‌నగర్‌కు రూ. 130, హైదరాబాద్‌కు రూ.320ల చార్జీ వసూలు చేశారు. అడిగేవారు లేరని ఇష్టానుసారంగా వసూలు చేయడమేమిటని ప్రయాణికులు అధికారుల తీరుపై మండిపడ్డారు. శనివారం మొత్తం 12 స్పెషల్ బస్సులను నడిపినట్లు డీఎం తెలిపారు. మహబూబ్‌నగర్‌కు ఎక్స్‌ప్రెస్ చార్జీ రూ. 110లు ఉండగా, స్పెషల్ బస్సులో రూ.140, హైదరాబాద్‌కు రూ.260 కాగా, స్పెషల్‌లో రూ.360 వసూలు చేశా రు. పండుగలు వస్తే ఎడాపెడా చార్జీలను వసూలు చేస్తూ ప్రజలపై భారం మోపుతున్నారని ప్రయాణికులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.