మహబూబ్‌నగర్, మే 23 : మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.276కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఇటీవల మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో పాలమూరులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి నిధులు కావాలని కోరడంతో వెంటనే మంజూరు చేసినందుకుగానూ సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్‌కు శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధికారుల సమీకృత కార్యాలయ భవన సముదాయంలోని స్టేట్ చాంబర్లో కలెక్టర్ రవినాయక్, అధికారులతో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పాలమూరును మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. పెద్ద చెరువు వద్ద 3 టీఎస్టీపీలతోపాటు ట్రంక్ మెయిన్ల నిర్మాణం చేపడుతామన్నారు. త్వరలోనే టెండర్లు ఆహ్వానించి పనులు చేపట్టి పాలమూరును హైదరాబాద్ తరహా మార్చుతామన్నారు. శుద్ధి చేసిన నీటిని మాత్రమే పెద్ద చెరువులోకి పంపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏనుగొండ రహదారి విస్తరణలో ఇండ్లు, స్థలాలు కోల్పోయిన వారితోపాటు జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జూన్‌లో జాతీయస్థాయి టోర్నమెంట్లు నిర్వహించనున్నందున అప్పటివరకు స్టేడియం పనులు పూర్తి చేయాలన్నారు. ఎంవీఎస్ కళాశాలలో స్టేడియాన్ని నెలాఖరులోగా సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం మినీ ట్యాంక్‌బండ్‌ను పరిశీలించారు. మంత్రి వెంట కలెక్టర్ రవినాయక్, అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీవో అనిల్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న, పలు శాఖల అధికారులున్నారు.
త్వరలో మంత్రి కేటీఆర్ రాక
జిల్లాలో నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించి సంస్థను ఏర్పాటు చేసేందుకు సైయింట్ కంపెనీ ముందుకొచ్చినందుకు త్వరలోనే మంత్రి కేటీఆర్ జిల్లాకేంద్రానికి విచ్చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పెద్ద చెరువు వద్ద నిర్మించే డ్రైనేజీ, ట్రాఫిక్ సిగ్నల్స్, వైకుంఠధామం, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు.
ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి
జిల్లాకేంద్రంలోని జహంగీర్ ఫీర్ ఐటీఐ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం పాలకవర్గసభ్యులతో కలిసి షాషాబ్‌గుట్ట దర్గాలో మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్ రహెమాన్, వక్ఫ్ బోర్డ్ కమిటీ చైర్మన్ అన్వర్‌పాషా, వక్ఫ్ కాంప్లెక్స్ కార్యదర్శి జాకీర్, ఈద్గా కమిటీ చైర్మన్ తఖీ, కౌన్సిలర్లు ఉన్నారు.