మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా లో ఆ ఎమ్మెల్యేలు చెప్పిందే వేదం.. వారు శాసించిందే వినాల్సిందే.. ఓ మండల తాసీల్దార్ ఇచ్చిన అనుమతుల పేరుతో దుందుభీలో దోచేస్తున్న ఇసుక విలువ రోజుకు అక్షరాల రూ.20 లక్షలు.. అవును ఇది నిజమే.. ఇప్పటివరకు దాదాపు 15రోజుల నుంచి తరలించిన ఇసుక విలువ సుమారు రూ.మూడు కోట్లు అంటే ఆశ్చర్యం వేయక మానదు. కానీ ఇది నిజం.. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇసుక దందాకు దుందుభీ సాక్ష్యంగా నిలుస్తోంది.
వాగు పరివాహక ప్రాంతాల్లోని ప్రజల్ని భయభ్రాంతులను చేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అవన్నీ బుట్టదాఖలు అవుతున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు, మైనింగ్‌శాఖ పట్టించుకోవడం లేదు. పోలీసుల కాపలాతో ఇసుక దందా జరుగుతున్నది.
ఉప్పునుంతల తాసీల్దార్‌పై ఒత్తిడి తీసుకొచ్చి రోజుకు ఐదు టిప్పర్ల అనుమతుల పేరుతో దాదాపు 100 టిప్పర్ల వరకు తరలిస్తున్నారు. ఏకంగా దుందుభీ వాగులో రెండు భారీ హిటాచీలను పెట్టి రాత్రింబవళ్లు ఇసుకను డంపులుగా పేర్చి నేరుగా వాగులలోకి వెళ్లడానికి రోడ్డు వేసి టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. గత రెండు రోజుల కిందట ‘నమస్తే తెలంగాణ’లో ‘దుందుభీని దోచేస్తున్నారు’ అనే కథనం వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుక మాఫియా అవతారమెత్తిన అధికార పార్టీ నేతలు మమ్మల్ని ఎవరు ఆపేది అంటూ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్ విసురుతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తెలకపల్లి మండల సరిహద్దుల్లోని దాసర్లపల్లి గ్రామంలో గత 15 -20 రోజుల నుంచి అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. ప్రభుత్వ పనులకు అంటూ దౌర్జన్యంగా ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఓ ఎమ్మెల్యే ఒత్తిడికి తలొగ్గి ఉప్పునుంతల తాసీల్దార్ అనుమతులు జారీ చేస్తున్నారు. ఈ అనుమతులు నిబంధనలకు విరుద్ధమని అధికారులకు కూడా తెలుసు. అధికార పార్టీ నేతల బెదిరింపులకు తలొగ్గి తాసీల్దారు ఇస్తున్న ఆర్డర్ కాపీలో ఎలాంటి వివరాలు లేవు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక తరలింపు పేరుతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ కలిసి దుందుభీ వాగును దోచేస్తున్నారని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ వాగు పరివాహ ప్రాంతాల్లో గ్రామస్తులను బెదిరించి దర్జాగా దోచుకెళ్తున్నారు. ఊర్లలో పేదలు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరకడం లేదు. ఆయా గ్రామాల్లో కూలీలను పెట్టి కొం తమంది ట్రాక్టర్లతో ఇసుక కొడుతుంటే వారి ని కూడా బెదిరించి వాగులోకి రానివ్వడం లేదు. ఆయా గ్రామాలు ఇసుక కొట్టొద్దని.. తీ ర్మానాలు చేసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి నా ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి భయపడి ఉన్నతాధికారులు దాసర్లపల్లి గ్రామంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రెవెన్యూ, మైనింగ్ శాఖ కూడా పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధం గా ఒక తాసీల్దార్ అడ్డగోలుగా అనుమతులు జారీ చేస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇంత జరుగుతున్నా నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. గతంలో ఇదే వాగుపై ఇసుకను తరలిస్తుంటే చాలా గ్రామాల ప్రజలు ఆందోళనలు చేసినా ఫలితం లేదు. అధికారదర్పంతో పోలీసు యంత్రాంగాన్ని అడ్డంపెట్టుకొని కొందరు అక్రమ సంపాదనకు ఒడిగడుతున్నారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ఇసుక దొరకకుండా చేస్తున్నారని ఆరోపణలు గుప్పించే అధికార పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందో వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ పని జిల్లా కేంద్రంలో గాని చుట్టుపక్కల కానీ జరగడం లేదు.. అన్ని శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. నిధులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఎక్కడా మొదలుపెట్టిన దాఖలాలు లేవు.
ఒకవేళ నిజంగా ప్రభుత్వ పనులకు ఇసుక తరలిస్తే సంబంధిత కాంట్రాక్టర్ ఏజెన్సీ పేరు.. క్యూబిక్ మీటర్‌కు కట్టిన చాలన్లు ఎక్కడా? సంబంధిత డిపార్ట్మెంట్ ఇసుక కోసం ఇండెంట్ పెట్టిన లేఖలు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఓ తాసీల్దార్‌తో ఇప్పిస్తున్నారు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ దౌర్జన్యంగా కొనసాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోకపోతే సమీప గ్రామాల ప్రజలు భారీ ఆందోళనకు సిద్ధమయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కోని దాసర్లపల్లిలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.