గద్వాల, ఏప్రిల్ 17 : జోగుళాంబ గద్వాల జిల్లాలో సీఎంఆర్ పేరిట కొందరు మిల్లర్లు అక్రమ దందాకు పాల్పడుతున్నా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించి మర ఆడించి ఇవ్వాలని సూచిస్తే ప్రభుత్వానికి బియ్యం ఇవ్వడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నా ఎవరూ అడిగే దిక్కు లేదు. దీంతో కొందరు సివిల్ సప్లయ్ అధికారుల సాయంతో రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లు బయటకు అమ్ముకొని ప్రభుత్వానికి అందాల్సిన బియ్యాన్ని ఎగ్గొడుతున్నారు. వానకాలం సీజన్ నుంచి బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయించాలని ప్రభుత్వంతోపాటు, మంత్రి, సివిల్ సప్లయ్ కమిషనర్ ఆదేశించినా ఇక్కడి అధికారులకు అవేవీ పట్టనట్లుగా 37మిల్లులకు ధాన్యం కేటాయించారు.
ఇందులో కేవలం ఐదుగురు మిల్లర్లు మాత్రమే బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చారంటే ఇక్కడి అధికారులు మిల్లర్లకు ఎంతగా సహకరిస్తున్నారో అర్థమవుతున్నది. అధికారులు ఒత్తిడి చేసిన సమయంలో మిల్లర్లు డీలర్ల వద్ద పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసి దానిని రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఇది తెలిసిన అధికారులు మిల్లర్లు ఇచ్చే అమమ్యాలకు ఆశపడి వాటిని పాస్ చేస్తున్నారు. ఇప్పటికీ వానకాలానికి సంబంధించి బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం లేదంటే ఇక్కడి అధికారులు మిల్లర్లను ఏమాత్రం వెనుకేసుకొస్తున్నారో అర్థమవుతున్నది. 2021-22 యాసంగికి సంబంధించి రూ.20కోట్ల పైగా విలువైన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వకుండా దోచేయడం సంచలనంగా మారింది.
దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి జూపల్లి అధికారులకు ఆదేశించినా ఇప్పటి వరకు ఆ విచారణ అతీగతి లేకపోవడంతో మిల్లర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్నది. మిల్లర్లు 2023-24, 2024, 2025 ఏడాది యాసంగి, వానకాలం సంబంధించి ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని తీసుకున్నా ప్రభుత్వానికి బియ్యం ఇవ్వడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నారు. వీటన్నింటిపై రాష్ట్రస్థాయి విజిలెన్స్ అధికారులు జిల్లాలోని అన్ని మిల్లుపై దాడులు నిర్వహిస్తే తప్పా అసలు నిజాలు బయట పడే అవకాశం లేదు.
2024-2025 వానకాలానికి సంబంధించి ప్రభుత్వం మిల్లర్లకు 96,618 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మిల్లర్లకు కేటాయించింది. వారు ప్రభుత్వానికి 60,420 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయాలి. ప్రస్తుతం యాసంగి కొనుగోళ్లు ఈనెల మూడోవారంలో అధికారులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వానకాలానికి సంబంధించిన బియ్యం ఇప్పటి వరకు మిల్లర్లు పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి ఇవ్వలేదు. 60,420 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 26,724. 385 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇంకా 34,294. 628 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉన్నది.
సరాసరి 43.80శాతం బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అందజేసినట్లు వారు ఇచ్చిన నివేదిక ద్వారా తెలిసింది. గత నెలలో గడువు ముగిసినా అధికారులు మళ్లీ గడువు పెంచారు. ఆ గడువులోగా మిల్లర్లు బియ్యం ప్రభుత్వానికి ఇస్తారన్నా నమ్మకం కూడా లేదు. ప్రస్తుతం ఈనెల చివరి వారంలో యాసంగిలో రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు కేటాయించడానికి పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వానకాలానికి సంబంధించిన బియ్యం పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి చెల్లించిన తర్వాతే ధాన్యం కేటాయిస్తే మంచిదనే భావన ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది. వానకాలానికి సంబంధించిన బియ్యం మిల్లర్లు ఇంకా ఇవ్వాల్సి ఉంది కాని ఇక్కడి సివిల్ సప్లయ్శాఖ అధికారులకు అవేవీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
2024-2025 వానకాలానికి సంబంధించి జిల్లాలో 37మిల్లులకు 96,618.800 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. మిల్లర్లు ప్రభుత్వానికి 60,420.788 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 26,724.385 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే మిల్లర్లు ప్రభుత్వానికి అందజేశారు. అధికారుల లెక్కల ప్రకారం 43.80శాతం బియ్యాన్ని మాత్రమే మిల్లర్లు ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంకా 34,294.628 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. అయితే కొన్ని మిల్లులు మినహాయిస్తే ఎక్కువ భాగం మిల్లర్లు వారు తీసుకున్న ధాన్యంలో సగభాగం మిల్లర్లు బియ్యం ప్రభుత్వానికి ఇవ్వలేదు. మరి కొంతమంది మిల్లర్లు కనీసం 15శాతం ధాన్యం కూడా ప్రభుత్వానికి ఇవ్వలేదు.
అయినప్పటికీ యాసంగిలో కొనుగోలు చేసిన వడ్లను తిరిగి మిల్లర్లకు కేటాయించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జోగుళాంబ రైస్ మిల్లు వారు 1,844మెట్రక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందజేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 289మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వగా, ఇంకా 1,572 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉన్నది. ఈ మిల్లు యజమాని కేవలం 15.56శాతం బియ్యం మాత్రమే ప్రభుత్వానికి అందజేశారు. కమ్మిడి స్వామి రైస్ మిల్ యజమాని ప్రభుత్వానికి 3,563 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయాల్సి ఉండగా, కేవలం 260 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అందజేశారు.
కేవలం 7.23శాతం బియ్యం ప్రభుత్వానికి అందజేశారు. శ్రీకృష్ణ ఇండస్ట్రీ 870 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం115 మెట్రిక్ టన్నులు అంటే కేవలం 13.15శాతం బియ్యం మాత్రమే అందజేశారు. శ్రీరామ రైస్ మిల్ 957 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం144 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే అంటే 14.97శాతం బియ్యం మాత్రమే ఇచ్చారు. మహాలక్ష్మి రైస్ ఇండస్ట్రీ 2066 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందజేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 318.590 మెట్రిక్ టన్నుల బియ్యం అంటే 15.27శాతం మాత్రమే అందజేశారు.
వీటితో పాటు వెంకటరమణ రైస్ మిల్లు 21.80 , శ్రీశ్రీనివాస ఇండస్ట్రీ27శాతం, ఈశ్వర్రైస్ మిల్లు 29 శాతం మాత్రమే ప్రభుత్వానికి బియ్యం సరఫరా చేశారు. భాను ట్రేడర్స్ 30శాతం, శివ విజయరాయ రైస్ మిల్లు 33శాతం, మణికంఠ ఇండస్ట్రీ 35శాతం మాత్రమే అందజేశారు. ఇలా సగ శాతమే మిల్లులు ప్రభుత్వానికి ధాన్యం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నా సివిల్ సప్లయ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జోగుళాంబ గద్వాల జిల్లాలో విధులు నిర్వర్తించే ఇద్దరు సివిల్ సప్లయ్ జిల్లా అధికారుల రూటే సపరేట్గా ఉంది. వారు కార్యాలయాల్లో కాకుండా వారు ని వాసం ఉంటున్న ఇంటి వద్దకు మిల్లర్లను పిలిపించుకొని చీకటి వ్యాపారాలు నడుపుతున్నట్లు తెలిసింది. ఆ ఇద్దరు అధికారులు ఎప్పుడు కార్యాలయంలో ఉండకుండా మిల్లర్లతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారనేది నగ్న సత్యం. ఆ ఇద్దరు అధికారులు ఏ సమాచారం అడిగినా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, కార్యాలయానికి వెళితే అక్కడ ఉండరూ అంతా ఆరు బయటే వారు వ్యవహారాలు కొనసాగిస్తురనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొంత మంది మిల్లర్లను అండగా ఉంచుకొని అక్రమ వ్యవహారా లు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఆ మిల్లర్లు చెప్పిందే వేదం. వారు ఏ మిల్లుకు ఎంత ధాన్యం కేటాయించమంటే అంతే ధాన్యం ఆ ఇద్దరు అధికారులు కేటాయిస్తారు. కొంత మంది మిల్లర్ల చేతిలో అధికారు లు కీలుబొమ్మలై ప్రభుత్వాన్ని నిండా ముంచుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మిల్లర్లపై పూర్తిస్థాయిలో విజిలెన్స్ అధికారులతో తనిఖీలు చేయిస్తే అసలు నిజాలు బయ ట పడే అవకాశం ఉన్నది. ఆ దిశగా ఉన్నతాధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.