మహబూబ్నగర్, నవంబ ర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జి ల్లాలో పత్తి రైతులు అ రిగోస పడుతున్నారు. నిబంధనల పేరుతో కాట న్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా (సీసీఐ) తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. దీంతో ఆ రుగాలం కష్టపడి పండించి మా ర్కెట్కు తీసుకొచ్చిన పత్తిని తేమ పేరుతో వాపస్ పంపిస్తున్నారు. ఎకరాకు ఇంతే కొనుగోలు చేస్తామని.. అంతకన్నా ఎక్కువ కొనుగోలు చేయమని రోజుకో నిబంధన పెడుతూ రైతులను తిప్పలు పెడ్తున్నారు. కొనుగోలు చే యాలంటూ ఐదు జిల్లాలో అనేకచోట్ల ఆం దోళన నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రభుత్వం 12 శాతానికిమించని తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. విషయం తెలియక దూరం నుంచి కష్టపడి పత్తిని తీసుకొస్తే నిబంధనల పేరుతో కొనుగోలు చేయని అధికారులపై రైతులు ఆగ్రహం చెందుతున్నారు. ప్రైవేట్లో అమ్ముకుందామంటే వ్యాపారులంతా సిండికేట్గా మారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకన్నా క్వింటాలుకు రూ.2 వేల తక్కువగా ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో పత్తి కొనుగోళ్ల వ్యవహారంపై కలెక్టర్ సంతోష్ అసహనం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి వెళ్లి పరిశీలించి రైతులను సముదాయించారు. అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. కొనుగోలు మందకొడిగా సాగడంపై అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సీసీఐ నిబంధనలు పత్తి రైతులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వం పత్తి రైతుకు మద్దతు ధర చెల్లించేందుకు సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రోజుకో నిబంధనలు జారీ కావడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రారంభంలో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సీసీఐ ఆ తర్వాత కొద్ది రోజులకే ఎకరాకు 7 క్వింటాళ్లకు పరిమితం చేసింది. సీసీఐ 8 నుంచి 12 శాతం తేమ నిబంధనతో క్వింటాలుకు రూ.7,800 నుంచి రూ.8,100 కాగా, అధిక వర్షాలతో గవ్వ, తేమశాతం ఎక్కువ ఉన్న పత్తిని కొనుగోలు చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో ఆన్లైన్లో ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు తక్కువ ధరకు ఇండస్ట్రీ యజమానులకు అమ్ముకునేందుకు ముందుకు వచ్చినప్పటికీ కొనుగోళ్లు జరగక పత్తి లోడ్లతో తిరిగి ఇంటి ముఖం పడ్తున్నారు.
రైతులు పండించిన పత్తిని ఇండస్ట్రీ యజమానులు కేవలం శని, ఆదివారం మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన రోజులు సీసీఐ ద్వారా కొనుగోలు జరుగుతుంది. ప్రైవే ట్ వ్యాపారులు, క్వింటాలు పత్తికి గరిష్ఠ ధర రూ.6,800, కనిష్ఠ ధర రూ.5,000గా నిర్ణయించి కొనుగోళ్లు జరుపుతున్నారు. వ్యాపారులంతా సిండికేట్గా మారి ప్రభుత్వ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకొని రైతులకు గాలం వేస్తున్నారు. ప్రభుత్వం ఎట్లా కొనదు.. తమకే అమ్మాలి.. అంటూ ఏకంగా కింటాలుకు రూ.2 వేల ధరను తగ్గించి రైతులను దగా చేస్తున్నారు. సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారుల మాయలో పడి వచ్చిన కాడికి చాలు అని అమ్మకాలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం రైతులను నట్టేట ముంచుతున్నదని తెలిసిన ప్రభుత్వాధికారులు పట్టించుకోవడం లేదు. వ్యాపారులంతా కుమ్మక్కై కేంద్రం నిబంధనలు అనుకూలంగా మార్చుకొని రైతులను ముంచుతున్నారు.
చలిమంచు దృష్ట్యా తేమశాతంలో కొంతమేర వెసులుబాటు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఆకాల వర్షాల కారణంగా కొంత పత్తి పంట దెబ్బతిన్నందున మద్దతు ధర కల్పించాలని, ప్రస్తుతం నిర్ణయించిన ధరతో తీవ్ర నష్టాల్లో కి కూరుకుపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేంద్రా ల్లో కొనుగోళ్ల సమ యం పెంచాలని, అ మ్మకానికి తెచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని డిమాం డ్ చేస్తున్నారు.
పత్తి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులు గురి చేస్తే చర్యలు తప్పవని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం చిన్న ముద్దునూరు గ్రామం వినాయక కాటన్ మిల్ వద్ద సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియ, ట్యాబ్ ఎంట్రీ, గేట్ ఎంట్రీ పాస్, పంట నమోదు ప్రక్రియను స్లాట్ బుకింగ్ తదితర అంశాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సమస్యలను సానకూలంగా స్పందించేలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
పత్తి రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అండగా ఉంటామని కలెక్టర్ రైతులతో అన్నారు. అక్కడికక్కడే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పత్తి రైతుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేశారు. 2025-26 ఏడాదికిగానూ కేంద్ర ప్రభుత్వం పత్తి పంటకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 8,110గా నిర్ణయించిందన్నారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 శాతం మధ్య ఉండాలన్నారు. ప్రతి 1 శాతం తేమ పెరిగినప్పుడు, ధర కూడా 1 శాతం తగ్గుతుంది.. 12 శాతం కంటే ఎక్కువ తేమ శాతం ఉన్న పత్తిని సీసీఐ రిజెక్ట్ చేస్తున్నారు.. అందుకే రైతులు బాగా ఆరబెట్టి, సరైన తేమ శాతం కలిగిన పత్తిని మా త్రమే విక్రయించాలన్నారు. రైతుల సౌకర్యార్థం ఈసారి కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానం అమ లు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ముందుగానే యాప్లో జిన్నింగ్ మిల్లును ఎంపిక చేసుకుని, నిర్ణయించిన తేదీకి స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.