మరికల్, జూలై 14 : మధ్యతరగతి సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్ జలసాగరాన్ని తలపిస్తున్నది.గతంలో భారీ వర్షాలు వస్తే కానీ నిండని పరిస్థితి. కానీ తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. దీంతో ప్రతి చుక్కనూ వృథాచేయకుండా ఒడిసిపట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జూరాల ప్రా జెక్టు బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోస్తూ కోయిల్‌సాగర్‌ను నింపుతున్నారు. దీంతో పంటలకు సాగునీరు పుష్కలమైంది.
రూ.52 కోట్లతో కాల్వలకు మరమ్మతులు
కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాల్వలకు మరమ్మతులు పూర్తయ్యాయి. వెడల్పుతోపాటు లైనింగ్ పనుల కోసం గతేడాది రూ.52 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. పనులు చేపట్టారు. 52 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో కాల్వలకు మరమ్మతులు నిర్వహించారు. అలాగే మరికల్, నర్వ మండలాల్లో పెండింగ్‌లో ఉన్న నూతన కాల్వల ఏర్పాటు కోసం జలవనరుల శాఖాధికారులతో నారాయణపేట, దేవరకద్ర ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడి మరో రూ.30 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ప్రస్తుతం కుడి వైపు కాల్వ 12 కి.మీ. ఉండగా.. ప్రస్తుతం 5 కిలోమీటర్ల వరకు పూర్తయ్యాయి. కాల్వ విస్తీర్ణం పెంచడంతోపాటు తూములకు మరమ్మతులు, లైనింగ్ పనులకుగానూ గతంలోనే రూ.31 కోట్లు, ఎడమ కాల్వ పనులకు రూ.27 కోట్లు మంజూరయ్యాయి. ఎడమ కాల్వ మొత్తం 28.3 కి.మీ.గానూ 15.5 కి.మీ. పనులు పూర్తయ్యాయి. ఇంకా భూసేకరణ చేపట్టాల్సి ఉండగా.. ఆ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. పాత కాల్వలకు మరమ్మత్తులతోపాటు కొత్త కాల్వలకు నూతన రూపు సంతరించుకోవడంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జూరాల టు సాగర్
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను ఉంద్యాల వద్ద ఒక పంప్ నుంచి ఎత్తిపోస్తుండడంతో సీసీ కుంట మండలం ఉంద్యాలకు చేరుతాయి. అక్కడ తిరిగి పంపింగ్ చేస్తుండడంతో పర్దీపూర్‌కు నీరు పారుతుంది. అక్కడి పర్దీపూర్ నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా మరికల్ మండలం తీలేరు పంప్‌హౌస్‌కు నీరు చేరుతుంది. నిత్యం ఒక పంప్ సాయంతో 315 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. నదిలో వరద పెరిగితే రెండు మోటర్ల సాయంతో పంపింగ్ చేయనుండగా. 600 క్యూసెక్కులు కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు, 30 క్యూసెక్కులు గొలుసుకట్టు చెరువులకు నీటిని మళ్లించనున్నారు. పంపింగ్కంటే ముందు కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో నాలుగున్నర అడుగుల నీటిమట్టం ఉండగా, కృష్ణాజలాల రాకతోనేడు 12అడుగులకు చేరింది. ఇప్పటి వరకు మొత్తంగా 2,205 క్యూసెక్కులు ఎత్తిపోశారు.
నీటి వృథాను ఆరికట్టవచ్చు..
కోయిల్‌సాగర్ కాల్వ లైనింగ్ పనులు చేపట్టడంతో నీటి వృథాను అరికట్టవచ్చు. గతంలో రైతులు కాల్వలకు గండ్లు కొట్టే ఆవకాశం ఉండేది. లైనింగ్ పనుల వల్ల కాల్వల్లో నీరు సాఫీగా తూముల ద్వారా రైతుల పంటలకు పాతాయి. దీంతో కొంత మేర నీటి వృథా తగ్గుతుంది.
– గాదం మల్లేశ్, రైతు, రాకొండ, నారాయణపేట జిల్లా
తూముల మరమ్మతు ఎంతో మేలు..
కోయిల్‌సాగర్ కాల్వ తూముల మరమ్మతులతో రైతులకు మేలు జరుగుతుంది. గతంలో తూమలు తెరవడం ద్వారా నీరు వృథా అయ్యేది. మరమ్మతులతో కింది పొ లాల రైతులకు నీరు సకాలంలో అందుతుంది. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి చొరవతో రైతులకు మేలు చేకూరుతుంది.