ఊట్కూర్ (కృష్ణ) జనవరి 17 : తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న కృష్ణానదిపై నిజాం నవాబు కాలంలో నిర్మించిన బ్రిడ్జి మరమ్మ తులను బుధవారం ప్రారంభించారు. దీంతో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను ఇరు రాష్ర్టాల అధికారులు నిలువరించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే బ్రిడ్జికి రెండు వైపులా ఇటు తెలంగాణ అటు కర్ణాటక పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రం రాయిచూర్కు చేరుకునేందుకు జడ్చర్ల వయా భూత్పూర్, కొత్తకోట, ఎర్రవల్లి, గద్వాల మీదుగా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మహబూబ్నగర్ నుంచి రాయిచూర్ వెళ్లే వాహనాలను నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రం నుంచి అమరచింత, వయా జూరాల డ్యాం, గద్వాల నుంచి వెళ్లేలా అధికారులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి రాయిచూర్కు వెళ్లే ఆర్టీసీ బస్సులను సైతం కృష్ణ మండలం టైరోడ్డు వరకు మాత్రమే నడిపిస్తుండగా అక్కడి నుంచి బ్రిడ్జిపై ప్రయాణికులు కాలి నడకతో దా దాపు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ కర్ణాటక పరిధిలోని దేవసూగూర్కు చేరుకుంటున్నారు.
దేవసూగూర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించేందుకు ప్రయాణికులు ఇదే వంతెనపై కాలినడన టైరోడ్డుకు చేరుకొని అక్కడి నుంచి వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మరోవైపు పరిసర ప్రాంతాల నుంచి ప్రయాణికులు రాయిచూర్కు వెళ్లేందుకు హిందూపూర్, కడేచూర్, సైదాపూర్, గూడూర్, గూగళ్, గబ్బూర్ మీదుగా వాహనాలను తరలించేందుకు పోలీసులు రూట్ మ్యాప్ ప్రదర్శించారు. కాగా, రాకపోకలను నిషేధించిన ఇరురాష్ర్టాల అధికారులు పోలీసులతో బ్రిడ్జికి రెండు వైపులా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కర్ణాటక ప్రభుత్వ నిధులతో వంతెనపై 2,488 ఫీట్ల పొడవు, 20 ఫీట్ల విస్తీర్ణంలో మరమ్మతు పనులు కొనసాగుతున్నా యి. 45 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని, అప్పటి వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.