మహబూబ్‌నగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ పచ్చ జెండా ఊపినా బీసీలకు మాత్రం తీవ్ర అన్యాయం తలపెట్టింది. దామాషా ప్రకారం రావలసిన 23 శాతం కోటాకు బదులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేవలం 20 శాతానికి మాత్రమే పరిమితం కావడం బీసీలను కలవర పరుస్తోంది. అత్యల్పంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో రొటేషన్ పద్ధతిలో బీసీలకు దక్కిన స్థానాలు కేవలం 13 శాతమే కావడంతో అక్కడ బలహీన వర్గాల నేత లు రగిలిపోతున్నారు. ఎన్నికల ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండేండ్ల తర్వాత చేపడుతున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు కుట్రపూరితంగా రిజర్వేషన్లను కుదించి రాజకీయ పదవులకు దూరం చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలకి అన్ని రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌ను కూడా ప్రకటిం చింది. బీసీల ఓట్లతో అధికారంలోకి రాగానే హామీలు మరిచి కుట్రపూరితంగా ఇటు రాజకీయంగా అటు ఆర్థికంగా బీసీలకు తీవ్ర మోసానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడిందని బీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బీసీలకు అనుకున్న విధంగా 23శాతం కన్నా ఎక్కువగానే సర్పంచ్ వార్డు స్థానాలను కేటాయించి.. జనరల్ స్థానాల్లో కూడా బీసీలను అవకాశమిచ్చి ప్రజాప్రతినిధులను చేసిన ఘనత దక్కింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయ బద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లను కూడా రాకుండా బీసీలకు అన్యాయం చేసిందని విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 1678 సర్పంచ్ స్థానాలు ఉండగా.. ఇందులో 23 శాతం రిజర్వేషన్ల ప్రకారం 385 బీసీ లకు దక్కాల్సి ఉండగా కేవలం 352 సర్పంచ్ పదవులు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తుందని సంఘాల ఐక్య కార్యా చరణ సమితి ఆరోపిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. దాదాపు 18 నెలల కిందటే జరగాల్సిన ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. ఈ లోపు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్త మవుతూ వస్తోంది. బీసీ సంఘాలు ఇతర రాజకీయ పక్షాల ఒత్తి ళ్లకు తలొగ్గిన సర్కార్ హైకోర్టు చీవాట్లు పెట్టడంతో ఎన్నికలకు రెడీ అయింది. కాగా ఎన్నికల ముందు బీసీలకు సైతం రాజకీయ ఉద్యోగ ఇతరత్ర వాటిల్లో రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు ఏకంగా 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశ చూ పించింది. ఈ మేరకు గట్టి హామీ ఇవ్వడంతో బీసీ ఓట్లను రాబ ట్టుకొని గద్దెనెక్కింది.
ఆ తర్వాత రిజర్వేషన్లపై మీనామేషాలు లెక్కించి చివరకు జీవో ఇచ్చి చేతులు దులుపుకొంది. ఈ జీవో ను హైకోర్టు కొట్టి వేయడంతో చివరకు పార్టీ పరంగా అంది స్తామని మరోసారి మోసానికి తెరలేపింది. హైకోర్టు జోక్యంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు పోతున్నా రాష్ట్ర సర్కారు రిజర్వేషన్ల అంశంలో గట్టి ఎదురుదెబ్బ త గిలింది. బీసీలకు అన్యాయం చేసి వారికి న్యాయబద్ధంగా రావాల్సిన స్థానాలను అగ్రవర్ణాలకు కేటాయించి మరోసారి తీవ్ర అన్యాయానికి గురి చేసిందని బీసీ సంఘాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో రిజ ర్వేషన్ల మాట పక్కన పెట్టి పాత పద్ధతిలోనే ఎన్నికలకు ముందుకు వెళుతూ 23 శాతం బీసీలకు కేటాయించాల్సిన స్థానాలను కూడా కోత పెట్టి రాజకీ యంగా అణగదొక్కే ప్రయత్నం మొదలుపెట్టింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీసీల కు న్యాయబద్ధంగా 23శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నిక ల్లో కల్పించాల్సి ఉన్నది. హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైన రాష్ట్ర సర్కార్ ఇటీవలే పొంతన లేకుండా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ సర్క్యులర్ విడుదల చేసింది. అయితే రొటేషన్ పద్ధతిలో బీసీలకు రావాల్సిన 23 శాతానికి బదులు ఉమ్మడి మహ బూబ్‌నగర్ జిల్లాలో కేవలం 20 శాతంలోపే సర్పంచ్ వార్డు స్థానాలు దక్కాయి.
దీంతో 1678 సర్పంచ్ స్థానాలు ఉన్న ఉమ్మడి జిల్లాలో 385 పదవులు రావాల్సి ఉండగా కేవలం 352కు మాత్రమే పరిమితం చేసిం ది. కొన్ని జిల్లాల్లో 23శాతం వచ్చినా చాలా జిల్లాల్లో మాత్రం తక్కువ స్థానాలు బీసీలకు కేటాయించి చేతులు దులుపుకొన్నది. బీసీ లకు పట్టు ఉన్న అనేక గ్రామపంచాయతీలో కుట్ర పూరి తంగా అధి కార పార్టీ జనరల్ స్థానాలుగా ప్రకటించి బీసీలను రాజ కీయంగా దెబ్బ తీసి ప్రాతినిధ్యం లేకుండా చేసింది. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఆశించిన స్థానాలు బీసీలకు దక్కలేదు.
ఉమ్మడి జిల్లాలో నాగర్‌కర్నూల్ జిల్లా వైశాల్య పరంగా.. నియోజకవర్గాలు మండలాల పరంగా పెద్ద జిల్లా. ఈ జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గంలో మాత్రమే పెద్ద ఎత్తున ఎస్టీలు ఉన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఒకటి రెండు మండలాల్లో ఎస్టీల జనాభా ఎక్కువ ఉన్నది. మిగతా నియోజకవర్గాల్లో బీసీలదే ఆదిపత్యం నడుస్తుంది. చారకొండ మండల కేంద్రంలో 4,500 ఓట్లకు గానూ బీసీల ఓట్లు 3500 పైగానే ఉంటాయి. విచిత్రంగా ఈ స్థానాన్ని జనరల్ స్థానంగా పేర్కొని రిజర్వేషన్ ప్రకటించారు. ఇదేవిధంగా ఈ జిల్లాలో అనేక చోట్ల కూడా బీసీ ల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి అవకాశం ఇవ్వ కుండా రొటేషన్ పద్ధతి అంటూ జనరల్ స్థానాలను ఎక్కువ మొత్తంలో చూపారు. ఫలితంగా ఈ జిల్లాలో 23 శాతం రిజర్వేషన్లు బీసీలకు న్యాయబద్ధంగా రావాల్సి ఉండగా కేవలం 13 శాతం మాత్రమే సర్పంచ్ వార్డు స్థానాలు దక్కాయి. ఇది పూర్తిగా బీసీలను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమేనని పలువురు మండిపడుతున్నారు.