ఇసుక తోడేళ్లు
మండలంలోని వివిధ గ్రామాల వాగుల నుంచి అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. సర్కారుకు పైసా ఆదాయం లేకున్నా ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.3500 నుంచి రూ.4వేల దాకా వసూలు చేస్తూ ఏటా కోట్ల రూపాయలు గడిస్తున్నారు. మండలంలో ప్రభుత్వ పరంగా ఒక్క క్వారీ లేకపోయినా ఇసుకపై ఏటా రూ.1.50కోట్ల వ్యాపారం జరుగుతోంది.
- వాగులను తోడేస్తున్న ఇసుకాసురులు
- యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
- ఏటా రూ.1.50కోట్ల వ్యాపారం
- వాగుల పక్కనే డంపులు
- పడిపోతున్న భూగర్భజలాలు
- ఆందోళనలో అన్నదాతలు
- పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు
కోడేరు, జూలై 12 : మండలంలోని వివిధ గ్రామాల వాగుల నుంచి అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. సర్కారుకు పైసా ఆదాయం లేకున్నా ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.3500 నుంచి రూ.4వేల దాకా వసూలు చేస్తూ ఏటా కోట్ల రూపాయలు గడిస్తున్నారు. మండలంలో ప్రభుత్వ పరంగా ఒక్క క్వారీ లేకపోయినా ఇసుకపై ఏటా రూ.1.50కోట్ల వ్యాపారం జరుగుతోంది. నాగులపల్లి ముత్తిరెడ్డిపల్లి వాగు, నాగులపల్లితండా వాగు, ఖానాపూర్ వాగు, మైలారం వాగుల్లో ఇసుక అక్రమ వ్యాపారులు ఉదయం రాత్రి తేడా లేకుండా జేసీబీలతో ఇసుకను ట్రాక్టర్లలో ఎత్తిపోసి వాగుల పరిసర ప్రాంతాల్లో డంపు చేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
దీంతో వాగుల సమీపంలో ఉన్న వ్యవసాయ బోరు బావులలో నీటిమట్టం గణనీయంగా పడిపోతున్నదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల వాగులనుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతున్నది. దీంతో ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడి ఇళ్లు కట్టుకునే సామా న్య మధ్యతరగతి ప్రజలకు ఇసుక భారంగా మారింది. కొంత మందికి అదే కల్పతరువైంది. మండలంలో ప్రభుత్వ పరంగా క్వారీ లేకపోయినా ఇసుకపై ఏటా రూ, 1.50 కోట్ల వ్యాపారం జరుగుతోంది.
ట్రాక్టర్‌కు రూ.4వేల వరకు..
సర్కారుకు పైసా ఆదాయం లేకున్నా ఈఅక్రమ దందాతో ఏటా కోట్ల రూపాయలను కొంత మంది ఇసుక వ్యాపారులు అధికారుల చేతులు మారుతున్నాయి. ఒక ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.3వేల నుంచి రూ. 4వేల దాకా వసూలు చేస్తున్నారు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి డిమాండ్ ఉన్న నేపథ్యంలో పలువురు ట్రాక్టర్ల యజమానులు, ఇసుక మాఫియా దారులు పగలూ రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా రవాణా చేస్తున్నారు.

కాగా మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్ఐ) రెండో లిప్టు ద్వారా పాన్‌గల్ బ్రాంచి కాల్వతో పాటు చెరువులు కుంటల్లోకి గత ఆరేళ్లుగా నీటిని వదులుతున్నారు. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించి ఇసుక మేటలు ఏర్పడుతున్నాయి. ఆయా వాగులనుంచి వందల ట్రిప్పుల కొద్ది ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతుంది. పెద్ద పెద్ద గోతులే మిగులుతున్నాయి. భూగర్భ జలాల మట్టం తగ్గిపోతుండటంతో ప్రమాదం నెలకొన్నది.
వాగుల పక్కనే ఇసుక డంపులు
నాగులపల్లితండావాగు, మైలారం వాగులో కొంద రు ఇసుక అక్రమ వ్యాపారులు ఇసుక మాఫియా ముఠా కలిసి ఆయా వాగుల్లో నాలుగు జేసీబీలతో ఇసుకను ట్రాక్టర్లలో ఎత్తిపోస్తున్నారు. ట్రాక్టర్లకు ఎత్తిన ఇసుకను వాగుల పరిసరాల్లో డంపులు చేసి అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరి కొందరు వాగులో ఉన్న ఇసుకను ట్రాక్టర్లతో ఎత్తిపోసి వాగు పక్కన డంపు చేసి ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.1200 చొప్పున విక్రయిస్తున్నారు. ఇదంతా రెవెన్యూ, పోలీస్ అధికారుల కనుసన్నల్లో నడుస్తున్నట్లు తెలుస్తున్నది.
ఖాళీ అవుతున్న వాగులు..
మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న వాగుల నుంచి ఇసుకను తరలిస్తుండటంతో వాగులన్ని ఖాళీ అవుతున్నాయని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. వాగులకు సమీపంలోని వ్యవసాయ బోర్లు బావుల్లో నీటి మట్టం గణనీయంగా పడిపోతున్నదని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాగుల్లో ఇసుక నిల్వ ఉంటే నీటిమట్టం పెరిగేదని కొందరు తమ ఇష్టానుసారంగా ఇసుకను తోడేస్తుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు అంటున్నారు. ప్రభు త్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలించొద్దని ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు ఓవైపు చెబుతుంటే ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు ఆ నిబంధనలు పట్టవా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఇలా తరలుతోంది..
కోడేరు మండలం నాగులపల్లితండా వాగు, మైలా రం వాగుల నుంచి జేసీబీలతో తీసిన ఇసుకను నాగులపల్లి , ముత్తిరెడ్డిపల్లి గ్రామాల మీదుగా వనపర్తికి జనుంపల్లి కోడేరు మీదుగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రాలకు ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. రోజుకు 100కు పైగానే వెళ్తున్నాయి. రైతులు బోర్లల్లో నీళ్లు ఇంకిపోతున్నాయని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కులేదని ఆవేదన చెందుతున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు రూ.5వేల నుంచి రూ.8వేల వరకు మామూళ్లు వసూళ్లు చెల్లిస్తున్నారు. కోడేరు మండలం మైలారం వాగులో జేసీబీ వాహనాలు పెట్టి అక్కడి నుంచి మైలారం సింగోటం గ్రామాల మీదుగా కొల్లాపూర్‌కు తరలిస్తున్నారు. అలాగే కదిరేపాడు, రాజాపూర్, సింగాయిపల్లి, గ్రామాల మీదుగా వనపర్తి జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. వాగుల పరిసరాల్లో పొలా లు ఉన్న రైతులు కొందరు డబ్బులకు మాట్లాడుకొని వారితో ఒప్పందం కుదుర్చుకొని ఇసుకను తోడేస్తున్నారు. ఎవరైనా వెళ్లి ఇసుకను ఎందుకు తీస్తున్నారని ప్రశ్నిస్తే తాము రైతుల భూముల్లో ఉన్న ఇసుకను కొనుగోలు చేశామని తప్పుడు ప్రచారం చేస్తూ తమ వ్యాపారాన్ని యథేచ్చగా కొనసాగిస్తున్నారు.
తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం..
మండలంలోని వివిధ గ్రామాల్లోని వాగుల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. పోలీసులు, ఇతర సిబ్బందితో తనిఖీలు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వాగుల్లో జేసీబీలు , ట్రాకర్లతో ఇసుకను తీయటానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పనులకు కూడా అనుమతులు తీసుకుంటేనే ఇసుకను తరలించాలి. అయితే కొందరు ఇందిరమ్మ ఇండ్లు, సీసీరోడ్లు వేస్తున్నట్లు చెబుతున్నారు. వారు కూడా అనుమతులు పొందాల్సి ఉంటుంది. లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటాం.
-జమీల్, తాసీల్దార్ కోడేరు
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

