గద్వాల, జూన్ 1 : ముందస్తు వర్షం కురువడంతో మురిసిన రైతన్న వానకాలం సాగుపై కొండంత ఆశతో విత్తనాలు వేసేందుకు పొలాలు సిద్ధం చేస్తున్నారు. గత వానకాలం సాగు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది వానకాలం సాగుకు రైతన్న సిద్ధమవుతున్నాడు. గత వానకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసినప్పటికి అనుకున్న స్థాయిలో పంటలు దిగుబడి రాలేదు. దీంతో ఈ ఏడాదైనా కాలం కలిసి వ స్తుందనే ఆశతో రైతులు వానకాలం సాగుకు సి ద్ధమవుతున్నారు.
ప్రస్తుతం వేసవిలో కూడా అ క్కడక్కడ వర్షాలు కురుస్తుండండతో రైతులు తమ పంట పొలాలను సిద్ధం చేసి ఉంచుకుంటున్నారు.
వానకాలం ప్రారంభమైన వెంటనే తమ పొలాల్లో విత్తనాలు విత్తుకోవడానికి రైతన్నలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వానకాలం పంటలకు సంబంధించి జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. జిల్లాలోని రైతులు వర్షాధారితంపై ఆధారపడడంతో పాటు, జిల్లాలో సాగు నీరు పుష్కలంగా ఉండడం, ఈ ఏడాది వివిధ పంటలు రైతులు సాగు చేస్తారని అధికారులు అంచనా వేసి వానకాలం ప్రణాళిక రూపొందించారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాల , నెట్టెంపాడ్ ప్రాజెక్టులు ఉండడంతో ఎగువన వర్షాలు కురిస్తే ఈ ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్న తర్వాత వాటి నుంచి నీటిని రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేసి అటు నుంచి చెరువులు నింపడం, వాటికింద ఆయకట్టు కొంత మేర పెరిగే అవకాశం ఉందని గుర్తించారు. దీనికి తోడు బోర్లలో, బావుల్లో నీటిశాతం పెరగడంతో సాగు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఎరువులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు విత్తేనాటికి సిద్ధం చేసి ఉంచాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. దీనికి తోడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించడంతో వారి సలహాలు సూచనలు రైతులకు అందడం కూడా సాగు పెరగడానికి మరో కారణం.
వానకాలంలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎక్కువ భాగం పత్తి, వరి, వేరుశనగ , పెసర, మొక్కజొన్న, కంది, ఆముదం, పొద్దుతిరుగుడు, అనుములు, మిర్చి, ఉల్లి తదితర పంటలు సాగు చేస్తారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో వ్యవసాయశాఖ పరిధిలో గద్వాల, అలంపూర్ నియోజక వర్గాల పరిధిలోని 13 మండలాలకు సంబంధించిన సాగుకు అధికారులు ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేశారు. 2024 వానకాలంలో జిల్లాలో 3,70,390 ఎకరాల్లో వివిధ పంటలు రైతులు సాగుచేశారు.2025 వానకాలంలో జిల్లాలో 3,67,211ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు.2026 వానకాలం సీజన్లో రైతులు 4,35,252 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. అంచనా పెరిగే అవకాశం ఉం దని అధికారులు చెబుతున్నారు. అందుకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలకు సంబందించి ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరయ్య తెలిపారు.
జిల్లాలో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేసే వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో రైతులు ఈ ఏడా ది కూడా పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లా మొత్తం రైతులు 2,09,144 ఎకరాల్లో పత్తి పంట సాగు వేస్తారని అంచనా వేశారు. ఈ ఏడాది వరి పంట 1,21,941 ఎకరాల్లో సాగు చేయనున్నారు. వీటితోపాటు మొక్కజొన్న 22,982 ఎకరాలు, వేరుశనగ 6396 ఎకరాలు, కందులు 23,739 ఎకరా లు, ఇతర పంటలు ఆముదాలు, పొగాకు, బ్లాక్గ్రా మ్.. ఇతరత్రా 18,207 ఎకరాల్లో సాగవు తాయని అంచనా. హార్టికల్చర్ పంటలైన మిరప, ఆయిల్‌పాం తో పాటు వాణిజ్యపంటలు మొత్తం 42,370 ఎకరాల్లో సాగు చేయనున్నారు. మొత్తం జిల్లాలో సాగు అంచనా 4,35,252 ఎకరాలు.
జిల్లాలో అధికంగా రైతులు పత్తి, వరి సాగు పైనే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 2,09,144ఎకరాల్లో పత్తి, 1,21,941 ఎకరాల్లో వరి సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పత్తికి మద్దతు ధర ఇస్తుండడంతో పాటు పత్తి పంటకు మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుండడంతో రైతులు పత్తి సాగుపై మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ అధికారులు కేవలం నల్లరేగడిలో మాత్రమే పత్తి పంట సాగు చేయాలని సూచిస్తున్న రైతులు వినకుండా అన్ని పొలాల్లో పత్తి పంట సాగు చేయడానికి రైతులు సన్నద్ధ మవుతున్నారు. కాగా ప్రభుత్వం వరిధాన్యానికి మద్దతు ధర కల్పించడంతో రైతులు ధాన్యం పంట సాగుపై కూడా ఆసక్తి చూపుతున్నారు.
నాగర్‌కర్నూల్, జూన్ 1 : నాగర్‌కర్నూల్ జిల్లా లో ఈ వానకాలంలో అధిక దిగుబడులు సాధించడానికి సరైన ప్రణాళికను ఎంచు కోవాల్సిన అవసరం ఉంది. రైతులు కాలంలో మంచి దిగుబడులు సాధించడానికి నష్టాలను నివారించడానికి సరైన యాక్షన్‌ప్లాన్ అను సరించడం ముఖ్యమని వ్యవసాయా ధికా రులు సూచిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో ఈసారి సాగు విస్తీర్ణం, ఏయే పంటలను అధికంగా సాగు చేస్తారనే విషయాలను అంచ నా వేశారు.
2026-27 వర్షాకాలానికి గానూ మొత్తం 6,35,938 ఎకరాల్లో పంటలు పం డించనున్నట్లు అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా హార్టికల్చర్ పంట 51,277 ఎకరాలలో మొత్తం జిల్లా వ్యాప్తంగా 6,87,215 ఎకరాలు సాగు విస్తీర్ణం ఉండను న్నది. ఇందులో అత్యధికంగా 1,92,796 వరి పంటను, ఆతర్వాత పంటగా పత్తి 3,08,845 ఎకరాల్లో సాగు చేయనున్నారు. అదేవిధంగా జొన్నలు 2,881 ఎకరాలు, మొక్కజొన్న 96,992 ఎకరాలు, కందులు 3,752 ఎకరాలు సాగు చేస్తారని అంచనా. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పండ్లు, కూరగాయలను 51,277 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచ నా వేశారు.
జిల్లా వ్యాప్తంగా వరి సాగుకోసం 48,199 క్వింటాళ్ల విత్తనాలు, 115 క్వింటాళ్ల జొన్నలు, 7,759 క్వింటాళ్ల మొక్కజొన్నలు, 2,780 క్వింటాళ్ల పత్తి విత్తనాలు, 113 క్వింటాళ్ల కందులతోపాటు ఇతర వివిధ రకాల పంటల కింద 613 క్వింటాళ్ల విత్తనాలతో మొత్తం 59,579 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవు తాయని అంచనా వేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో మొత్తం 6,87,215 ఎకరాల్లో పంటల సాగుకోసం 59,579 క్విం టాళ్ల విత్తనాలు అవసరం ఉండగా, 1,21, 881 మెట్రిక్ టన్నుల ఎరువులు అవ సరమ వుతాయని వ్యవసాయాధికా రులు గుర్తించారు. ఇందులో యూరియా 66,508 మెట్రిక్ టన్నులు, డీఏపీ 14,089 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ (వివి ధ రకాలు) ఎరువులు 37,203 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2 ,265 మెట్రిక్ టన్నులు అవసర మవుతాయని అగ్రికల్చర్ అధి కారులు అంచనా వేశారు.
పాలమూరు, జూన్ 1 : మహబూబ్‌నగర్ జిల్లాలో వానకాలం సీజన్లో 4,05,236 ఎకరాలలో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. గతేడాది కంటే ఈసారి 58,406 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా.. ఇప్పటికే రైతులు పొలాలు దుక్కి దున్ని పంటల సాగుకు సిద్ధమయ్యారు. అన్నింటికన్నా వరి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. 2.40 లక్షల ఎకరాల్లో పంట సాగయ్యే అవకాశం ఉన్నది. తర్వాత 95,000 ఎకరాల్లో పత్తి పంట సాగుకానుండగా.. నాటేందుకు 90,000 ప్యాకెట్లు (ఒక్కో ప్యాకెట్ 450 గ్రాములు) విత్తనాలు అవసరం పడనున్నాయి.
మొక్కజొన్న 45,000 ఎకరాల్లో సాగు కానుండగా.. 3,150 క్వింటాళ్ల వితనాలు అవసరం పడనున్నాయి. అలాగే కందులు 12 వేల ఎకరాల్లో సాగుకుగానూ 480 క్వింటాళ్ల విత్తనాలు.. జొన్న 12 వేల ఎకరాలకుగానూ 600 క్వింటాళ్ల విత్తనాలు, ఇతర పంటలు మొత్తం1,250 ఎకరాల్లో సాగుకానున్నాయి. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎ రువుల వినియోగం, ఇతర అంశాలపై జిల్లా వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. కాంప్లెక్స్ ఎరువులు 21,188 మెట్రిక్ టన్నులు, యూరియా 52,968 మెట్రిక్ టన్నులు, డీఏపీ 21,188 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 16,950 మెట్రి క్ టన్నులు, ఎస్ఎస్పీ 12,713 మెట్రిక్ టన్నులు అవసరం కానున్నట్లు అంచనా.
నారాయణపేట, జూన్ 1 : వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. నారాయణపేట జిల్లాలో ఏఏ పంటలు ఎన్ని ఎకరాల్లో సాగవుతాయో వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 4.35 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు ప్రణాళిక సిద్ధం చేశారు. వీటిలో లక్షా 90 వేల ఎకరాల్లో అధికంగా వరి వేయనుండగా.. లక్షా 85 వేల ఎకరాల్లో పత్తి, 60 వేల ఎకరాల్లో కందితోపాటు వేరుశనగ, ఇతర పంటలు సాగుకానున్నాయి. సాగయ్యే పంటలకు 54,200 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కానున్నదని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. పత్తి సాగుకు 3.60 లక్షల విత్తన ప్యాకెట్లు, వరి కోసం 47,500 క్వింటాళ్ల విత్తనాలు, జొన్న కోసం180 క్వింటాళ్ల విత్తనాలు, పెసర సాగుకు 100 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
వనపర్తి, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : మే నెలలోనే అకాల వర్షాలు కురవడంతో భూమి అదునైంది. దీంతో వానకాలం సాగుకు రైతులు కోటి ఆశలతో సన్నద్ధమవుతున్నారు. దుక్కి దున్ని పొలాలను ఇప్పటికే సిద్ధం చేశారు. రుతు పవనాలు ఆగమనం.. వరుణ దేవుడు కరుణించిన వెంటనే రైతులు విత్తుకునేందుకు రెడీగా ఉన్నారు. వనపర్తి జిల్లాలో ఈ సీజన్లో 3.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుకానున్నాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. వీటిలో 2.32 లక్షల ఎకరాల్లో వరి సాగు కానున్నట్లు, అలాగే 18 వేల ఎకరాల్లో పత్తి, 16 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 14 వేల ఎకరాల్లో వేరుశనగ, 21 వేల ఎకరాల్లో మినుములు, 30 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు కానున్నట్లు ప్రణాళిక సిద్ధం చేశారు. పంటల సాగుకు ఈ సీజన్లో 29,855 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు నిర్ణయించారు.
గద్వాల జిల్లాలో వానకాలంలో సాగు కానున్న పంటలకుగానూ అవసరమైన వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. జిల్లాకు 1.11 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని తెలిపారు. అలాగే యూరియా 27,390 మెట్రిక్ టన్నులు అవసరమంటూ అంచనా వేశారు. డీఏపీ 13,919 మెట్రిక్ టన్నులు, పొటాష్ 7,615 మెట్రిక్ టన్నులు, సూపర్ ఫాస్పేట్ 7,418 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 55,173 అవసరం పడనున్నాయి. ప్రస్తుతం యూరియా 5105 మెట్రిక్ టన్నులు, డీఏపీ 11,017మెట్రిక్ టన్నులు, సూపర్ ఫాస్పేట్ 782మెట్రిక్ టన్నులు, పొటాష్ 1,342 మెట్రిక్ టన్ను లు, కాంప్లెక్స్ ఎరువులు 17,090 మెట్రిక్ టన్నులు.. ఇలా మొత్తం 25,339 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి.