మాగనూరు, జూలై 8 : వారం రోజులుగా మాగనూరు మండల కేంద్రంలోని పెద్ద వాగు నుంచి ఇసుక తరలిపోకూడదని పలుమార్లు అడ్డువేసినా రాఘవ కన్స్ట్రక్షన్ సిబ్బంది మొండి పట్టుదలతో వాగులో ఇసుక తరలించడానికి వస్తుండడంతో సంబంధిత అధికారులపై మాగనూరు గ్రామస్తులు మండిపడ్డారు. మంగళవారం మాగనూరులోని పెద్దవాగులో జేసీబీలు, ఆరు ట్రిప్పర్లను వాగులోకి తీసుకెళ్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు భారీ ఎత్తున మాగనూరు వాగు దగ్గరకు చేరుకున్నారు. అకడికి చేరుకొని సరికి రైతులను వాగులోకి దిగకుండా ఎస్సై అశోక్ బాబు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మాగనూరు పెద్దవాగుపై ఎకనుందో వచ్చిన వ్యక్తులు పెత్తనం చూపించడం ఏమిటని భవిష్యత్లో జరిగే పరిణామాలపై ఎవరు దృష్టి సారిస్తారని ఎస్సైని ప్రశ్నించారు. మాగనూరు గ్రామస్తులంతా ఆదివారం ఇసుక తరలించకుండా చూసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా పోలీస్ రెవెన్యూశాఖ అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వ పనులకు ఇసుక తరలించాల్సిందేనని గ్రామస్తులతో చెప్పుకొచ్చారు. అయితే గ్రామస్తులు ఇసుక తరలించకుండా ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని కాదని ఎలా తరలిస్తారో చూస్తామని పోలీసులకు హెచ్చరించారు.
అయినా పోలీసులు వినకుండా గ్రామస్తులను వాగులోకి దిగకుండా తగు జాగ్రత్తలు పాటించారు. సీఐ రాంలాల్ గ్రామస్తులతో ఫోన్లో మా ట్లాడించి ఇసుక తరలించడానికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఇసుక తరలించడానికి మాపై అధికారులు మంత్రుల నుంచి ఒత్తిడి వస్తుందని ఏ విధంగా అయినా ఇసుక తరలించాలని అధికారులు మాకు ఒత్తిడి తీసుకురావడంతోనే గ్రామం నుంచి ఇసుకను తరలిస్తున్నామంటూ గ్రామస్తులకు చెప్పినట్లు వారు తెలిపారు. రాఘవ కన్స్ట్రక్షన్ సిబ్బంది మాగనూరులో గుర్తించిన రిచ్ల ద్వారా ఇసుక తరలిస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని అలాంటిది మాగనూరులోనే ఎందుకో ఇంత మొండి పట్టుదలతో ఇసుక తరలించడానికి రావడం ఏమిటని మండిపడ్డారు.
ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కంపెనీ సిబ్బంది, పోలీసులు, గ్రామస్తులకు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గ్రామస్తులు మంత్రి వాకిటి శ్రీహరి దగ్గరకు వెళ్లి సమస్యను వివరస్తామని, తర్వాత మంత్రి ఏం చెప్పినా దానికి కట్టుబడి ఉంటామని అప్పటి వరకు ఇసుకను తరలించొద్దని పోలీసులతో వాదనలకు దిగారు. అయితే వచ్చిన టిప్పర్లను నింపి పంపిస్తామని నింపి పంపించిన తర్వాత మళ్లీ టిప్పర్లు రావని అప్పటి వరకు మంత్రితో మాట్లాడి సమస్య పరిషరించుకోవాలని ఎస్సై గ్రామస్తులకు సూచించారు. అయితే గ్రామస్తులు కూడా వచ్చిన రెండు టిప్పర్లను మాత్రమే నింపి పంపాలని చెప్పడంతో సమస్య అక్కడితో పరిష్కారం అయ్యింది.
అనంతరం రాఘవ కన్స్ట్రక్షన్ సిబ్బంది రెండు టిప్పర్లతో వాగులోంచి ఇసుకను తరలించారు. గ్రామస్తులంతా కలిసి మరోమారు చర్చించుకుంటామని కోరగా రెండు రోజుల్లో మాట్లాడుకోవాలని లేదంటే పటిష్ట బందోబస్తు మధ్య ఇసుకను తరలించడం జరుగుతుందని తాసీల్దార్ నాగలక్ష్మి, ఎస్సై అశోక్బాబు గ్రామస్తులకు సూచించడంతో వారు తిరిగి వెళ్లిపోయారు.