ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఆది నుంచి కరెంట్ కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత నాటి సీఎం కేసీఆర్ కరెంట్ కష్టాలు దూరం చేయడంతో పదేండ్లు ఎలాంటి కోతలు లేకుండా నిరంతరం విద్యుత్‌ను అందించడంతో రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతంకాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. రైతులు విద్యుత్ కోతలతో తమ పంటలను ఎండబెట్టుకొని పూర్తిగా వదిలేసుకున్న పరిస్థితులు ఎన్నో చూశాం. మరమ్మతుల పేరుతో రోజుకు గంట నుంచి మూడు గంటలపాటు కోతలు విధిస్తుండడంతో ప్రజలు, చిరువ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గద్వాల, మే 25 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయాంలో ఉన్న కరెంట్ కష్టాలు ప్రజలు, రైతులకు ఇన్నాళ్లకు మళ్లీ మొదలయ్యాయి. జిల్లాలో మరమ్మతుల పేరిట విద్యుత్‌శాఖ అధికారులు కోతలు విధిస్తుండడంతో ఇటు ప్రజలతో పాటు రైతులు విద్యుత్‌శాఖ అధికారుల తీరుపై మండి పడుతున్నారు. జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మరమ్మతుల పేరిట నెలలో 10 రోజులకు పైగా గంట నుంచి మూడు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నారు. దీంతో ప్రజలతో పాటు చిరువ్యాపారులు, గృహిణులు విద్యుత్‌శాఖ అధికారుల తీరుపై మండి పడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కరెంట్ కోతలు తప్పవని, కరెంట్ వైర్లపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి వస్తుందని గతంలో కాంగ్రెస్ సీఎం అన్న మాటలు ప్రస్తుతం వారి పాలనలో అదే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. 2014 రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్యపై దృష్టి సారించారు. విద్యుత్ శాఖలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి రైతులు, ప్రజలు, చిరువ్యాపారులు, పరిశ్రమలకు ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తకుండా నిరంతర విద్యుత్‌ను అందించారు.
గత కాంగ్రెస్ సీఎం అన్న మాటలు తిప్పి కొడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెప్పపాటు కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకొని సీమాంధ్ర పాలకులు చేసిన ఆరోపణలకు నిరంతర విద్యుత్ అందించి తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ ధీటైన సమాధానం ఇచ్చాడు. గత పదేండ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించి, కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ విద్యుత్ వ్యవస్థను తీర్చిదిద్దాడు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఓ వైపు మరమ్మతుల పేర మూడు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పాటు ,అనధికారికంగా రోజులో మరో రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
మరమ్మతుల పేర మూడు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిపివేత
నెలలో 10రోజులకు పైగా జిల్లాలో మరమ్మతుల పేర రెండు నుంచి నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరా విద్యుత్‌శాఖ అధికారులు నిలిపివేస్తున్నారు. ఉదయం 7నుంచి 9గంటల వరకు, మరోసారి 11గంటల వరకు, సాయంత్రం 3నుంచి 5గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ముఖ్యంగా ఉద్యోగస్తులు, గృహిణులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏప్రిల్‌లో 10రోజుల పాటు ఉదయం 7 నుంచి 10గంటల వరకు,11 నుంచి 12గంటల వరకు, 3 నుంచి 5 గంటల వరకు మరమ్మతుల పేరిట విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మే నెలలో ఇప్పటి వరకు ఆరురోజుల పాటు ఉదయం 7 నుంచి 8గంటల వరకు 10నుంచి11 గంటలవరకు మరమ్మతుల పేరుతో అప్రకటిత కోతలు విద్యుత్‌శాఖ అధికారులు విధిస్తున్నారు.
ఒక్కో ప్రాంతంలో ఒకసారి అలా రోజులో రెండు ప్రాంతాల్లో రెండు సమయాల్లో విద్యుత్ సరఫరా నిssssలిపి వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. విద్యుత్ కోతలు భరించలేక ప్రజలు ఇన్వర్టర్లు కొనుగోలు చేసి ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు విధిస్తున్న అప్రకటిత కోతల కారణంగా చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జిరాక్స్‌సెంటర్ నిర్వాహకులు, మోటర్ వైండింగ్ వారు, పిండిగిర్నీలు, హోటళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో మళ్లీ ప్రజలకు, చిరువ్యాపారులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యుత్‌శాఖ అధికారులు స్పందించి ఎక్కువ కోతలు లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మరమ్మతులు చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.