అచ్చంపేట : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ( Pink flag ) రెపరెపలాడే విధంగా కార్యకర్తలు పనిచేయాలని పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) పిలుపునిచ్చారు. అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండల పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బల్మూర్ మండలంలోని ప్రతి గ్రామ పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుస్తానని పేర్కొన్నారు.
గ్రూపు రాజకీయాలు లేకుండా సమన్వయంతో పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని కోరారు. పార్టీలో వ్యక్తులు వస్తుంటారు. పోతుంటారు. పార్టీలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని వెల్లడించారు. పార్టీను కాపాడే శక్తి కార్యకర్తలకు మాత్రమే వుంటుందని అన్నారు.అధికారంలోకి రావడం కోసం అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలుగా ప్రజాపాలన పేరిట ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ మోసపూరిత హామీలపై ప్రజల్లో చైతన్యం చేయాలని సూచించారు. మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట పార్టీ సీనియర్ నాయకులు పోకల మనోహర్ , మున్సిపల్ మాజీ చైర్మన్లు నర్సింహా గౌడ్, తులసి రామ్, మాజీ ఎంపీపీలు కరుణాకర్ రావు, పర్వతాలు, నాయకులు బండపల్లి వెంకటయ్య, కేటీ తిరుపతయ్య, అమినొద్దీన్ , కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు .