పెబ్బేరు, ఫిబ్రవరి 20: పెబ్బేరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో రోడ్ల విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ అర్బన్ ఫైనాన్సియల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసిన రూ.14కోట్లను రోడ్ల విస్తరణ, డ్రైనేజీలు, డివైడర్ల నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. రోడ్ల విస్తరణలో భాగంగా రోడ్డు విస్తరణకు రూ.7కోట్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.4కోట్లు, డివైడర్ నిర్మాణానికి రూ.2 కోట్లు, చెలిమిల్ల రోడ్డు ఆధునీకరణకు రూ.కోటి కేటాయించారు. అదేవిధంగా లైటింగ్ వ్యవస్థకు మున్సిపల్ నిధులను వినియోగిస్తున్నారు.
మున్సిపల్ కార్యాలయం నుంచి జూరాల క్యాంపుకాలనీ వరకు ఉన్న ప్రధానరోడ్డును 100అడుగులు, సుభాష్చౌరస్తా నుంచి అంబేద్కర్‌నగర్ వరకు ఉన్న వనపర్తి రోడ్డును 80అడుగుల మేర విస్తరించే ప్రక్రియ కొనసాగుతున్నది. రోడ్లకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆక్రమించుకొని ఉండడంతో అధికారులు ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. వెంటనే డ్రైనేజీని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా సుభాష్చౌరస్తా నుంచి వనపర్తి వెళ్లే రహదారిపై ఏండ్లుగా ఆక్రమణలు జరిగాయి. రోడ్డును ఆక్రమించుకొని దుకాణాలు, ఇండ్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుపై ఎన్ని నిర్మాణాలు పూర్తిగా, పాక్షికంగా కూల్చివేతకు గురవుతాయో మున్సిపల్ అధికారులు గుర్తించారు. 26నిర్మాణాలు పూర్తిగా, 11నిర్మాణాలు 5అడుగులు, 19నిర్మాణాలు 6 నుంచి 10అడుగులు, 48నిర్మాణాలు 11నుంచి 26అడుగుల మేర కూల్చివేతకు గురవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పట్టణ ప్రజలు అభివృద్ధికి సహకరించాలి
పెబ్బేరు పట్టణంలో నిర్మిస్తున్న రోడ్ల విస్తరణ పనుల్లో పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించేందుకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అంగీకరించారు. మిగితా బాధితులకు జరిగిన నష్టాన్ని బట్టి ఆదుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రోడ్ల విస్తరణ పూర్తయితే పట్టణంలో ట్రాఫిక్ సమస్యతోపాటు మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. పుర ప్రజలు విస్తరణ పనులకు సహకరించాలి.
– కరుణశ్రీ, మున్సిపల్ చైర్పర్సన్, పెబ్బేరు