కోస్గి, జనవరి11 : కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఆనవాళ్లు లేకుండా చేస్తామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కోస్గిలో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మో సపూరిత హామీలతో సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్‌రెడ్డి తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. ఇంకా కొన్ని రోజుల్లో కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ ఆనవాళ్లు లేకుండా చేస్తారని ఇది మర్చి పోవద్దని ఆయన హెచ్చరించారు. ప్రజలను మోసపూరిత హామీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన మీరు కేసీఆర్‌ని విమర్శించడం మీ అహంకారానికి నిదర్శనమన్నారు. గతంలో కోస్గి మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా జయకేతనం ఎగుర వేసిందని ఈ ఎన్నికల్లో కూడా మళ్లీ బీఆర్ఎస్ నాయకులు గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యకర్తలు నాయకులు కలిసి ప్రజల్లో తిరుగుతూ గత బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కాంగ్రెస్ మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. గతంలో తాను ఎమ్మేల్యేగా ఉండి చేసిన అభివృద్ధే తప్పా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్‌పై వ్యతిరేకతను చూపించారన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కొడంగల్‌లో రేవంత్ ఆనవాళ్లను శాశ్వతంగా తుడిచి వేయాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సాయిలు, జనార్దన్ రెడ్డి, వెంకట్ నర్సిములు, చెన్నయ్య, కోనేరు సాయప్ప, బుగ్గప్ప, బెజ్జు నర్సిములు, చెన్నయ్య, చెన్నప్ప, మాజీ జెడ్పీటీసీ మహిపాల్ పాల్గొన్నారు.