మద్దూర్, మార్చి 24 : రాష్ట్రంలో, ముఖ్యంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రైతులు కన్నీరు పెడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పట్టడం లేదని, గ్రామల్లో తాగు నీరు దొరకని పరిస్థితి ఏర్పడిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మద్దూర్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంత వరదలు ఈ దఫా వచ్చినా శ్రీశైలంలో నీరు ఎందుకు లేకుండా పోయిందో అందరికీ తెలుసన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు కోసం గురు దక్షిణ కింద కృష్ణనీటిని ఆంధ్రలోని పోతిరెడ్డిపాడు నుంచి తరలించింది రేవంత్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గంలో రైతులు పంటలు ఎండిపోయి కన్నీరు పెడుతున్నా ముఖ్యమంత్రికి పట్టడం లేదన్నారు. కోస్గి మండలంలోని చంద్రవంచ సభలో మార్చి నాటికి రైతులందరికీ రైతు భరోసా వేస్తానని చెప్పినా నేటికీ రైతుల ఖాతాల్లో రైతు భరోసా డ బ్బులు జమకాలేదని, అబద్ధపు ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఉగాది నాటికి రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.రెండు లక్షల రూణమాఫీ విషయంలో ప్రభుత్వం చేతులేత్తేసిందని, రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసే వరకు ముఖ్యమంత్రిని విడిచిపెట్టేది లేదన్నారు. ఎండిన పంటలకు ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని జామియా మసీదు వద్ద ముస్లింకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సలీం, శాసం రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు గోపాల్, వీరారెడ్డి, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.