అయిజ, మార్చి 13 : ఇందిరమ్మ ఇంటి బిల్లు విడుదల కోసం రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ పంచాయతీ కార్యదర్శి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం మేరకు.. అయిజ మండలంలోని ఎక్లాస్పురం గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి బిల్లు విడుదలకు లబ్ధిదారుడి వద్ద పంచాయతీ కార్యదర్శి బోయ రంగన్న ప్రతి ఇన్స్టాల్ మెంట్ రూ. 5వేల చొప్పున రూ. 20వేలు లంచం డిమాండ్ చేశారు.
లబ్ధిదారుడి భర్త ఉరుకుందు పంచాయతీ కార్యదర్శిని బతిమిలాడి రూ. 15 వేలకు కార్యదర్శి తగ్గించారు. శుక్రవారం లబ్ధిదారుడి భర్త ఉరుకుందు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో రూ. 15వేల నగదును కార్యదర్శికి ఇచ్చాడని డీఎస్పీ తెలిపారు. వెంటనే అప్రమత్తమై కార్యదర్శితోపాటు రూ. 15 వేల నగదును స్వాధీనం చేసుకొని పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.
ఫిర్యాదుదారుడి భార్యకు సంబంధించిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదటి విడుత బిల్లు విడుదల చేయడం, మిగితా మూడు విడుతల బిల్లుల విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా మంజూరు చేయడం కోసం కార్యదర్శి లంచం కోరినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఉరుకుందు ఫిర్యాదు మేరకు కార్యదర్శిపై కేసు నమోదు చేసుకొని నాంపల్లిలోని ఏబీసీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఆయన తెలిపారు. ఏసీబీ దాడుల్లో ఎస్సైలు లింగస్వామి, జిలానీ, సిబ్బంది పాల్గొన్నారు.