ధరూరు, జూన్ 16 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం లక్ష్యం నీరుగారుతున్నది. మండలంలోని కొత్తపాలెంలో మూడు నెలలుగా తాగునీటి సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. ప్రధానంగా బీసీ కాలనీలో తాగునీటి సమస్యపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా స్పందన కరువైందన్నా రు. ప్రజాపాలన అంటే ఇదేనా? మేమే మరమ్మతులు చేసుకోవాలా? అని ప్రశ్నిస్తున్నారు. లైన్మెన్కు ఫోన్ చే స్తే వాటర్‌మెన్ పేరు చెబుతున్నాడని.. ట్యాంక్‌లోకి నీళ్లు ఎక్కించడం ఇబ్బందవుతుందని పంచాయతీ కార్యదర్శి అంటున్నాడని వాపోయారు. తాగునీటి కోసం బోరు బావుల వద్దకు పోవాల్సిందేనా? అని నిలదీస్తున్నారు.
మూడు నెలలుగా మా కాలనీకి నీళ్లు వస్తలేవు. రోజూ పక్క కాలనీలో తెచ్చుకుంటు న్నాం. మా కాలనీలో 60 కుటుంబాలున్నయ్. ఇన్ని కుటుంబాలు పక్క కాలనీలకు పోయి నీళ్లు తెచ్చుకోవాలంటే శానా ఇబ్బందులైతయ్. కింది కాలనీ వాళ్లు భగీరథ పైప్‌లైన్‌కు మోటర్లు అమర్చి చెర్రలు తీసి వాడడం వల్ల నీళ్లు ఎక్కడం లేదని పంచాయతీ కార్యదర్శి చెబుతున్నడు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పుడు మూడు రోజలు ఇ బ్బంది లేకుండా వచ్చినయి. మరి కింది కాలనీల వాళ్లు మోటర్లు పెడితే మాకు ఆ మూడురోజులెట్లా నీళ్లొచ్చియ్? ఇక్కడున్న వాటర్‌మెన్ సక్కగ పనిచేస్తలేడు. ట్యాంక్ కు ఎక్కించనందుకే మా కాలనీకి నీళ్లొస్తలేవు. లైన్మెన్ కూడా ట్యాంక్‌కు నీళ్లు ఎక్కించనందుకే వస్తలేవని చెప్పిండు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. వీడి యో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా స్పందిస్తలేరు. – హనుమంతు, గ్రామస్తుడు
నీళ్ల కోసం నాలాంటి ముసలోళ్లు యాడికని పోతరు. కడవలతో అంత దూరం పోయి నీళ్లు తెచ్చుకోలేం. మమ్మల్ని ఎందుకింత ఇబ్బంది పెడుతున్నరో అర్థమైతలేదు. మా పిల్లలను బతిమాలి నీటిని తెప్పించుకుంటున్నాం. ఇప్పుడు అందరికీ పనుల కాలం.. నీళ్లకే ఇన్ని తంటాలు పడుతున్నాం. పొద్దు పోతున్నది. నీళ్లకే ఇంత టైమైతే వంట పనులు ఎప్పుడు చేసుకోవాలా? పనులకెప్పుడు పోవాలా? మా బాధ పట్టించుకొని సాయం చేయండి సారూ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంక నీళ్లకు చాలా ఇబ్బందైతున్నది. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. పెద్ద సారోళ్లకు మొరపెట్టుకుంటే మూడురోజులు వచ్చినయ్. తరువాత బంద్ అయినయ్. ఇప్పటికైనా మా సమస్యను తీర్చండి.
గ్రామీణ వ్యవస్థ అస్తవ్యస్తం కావడానికి, ప్రజలు ఇబ్బందులు పడడానికి ప్రస్తుత ప్రభుత్వమే కారణం. గ్రామ పంచాయతీల్లో నిధులు లేవు. అప్పుడు పంచాయతీ కా ర్యదర్శులు పనులెలా చేస్తరు? పంచాయతీలో ప్రతిరోజూ ఖర్చులు చాలా ఉంటాయి. ఇప్పటికే కార్యదర్శులు గ్రామస్థాయిలో సొంత పైసలు ఖర్చుపెట్టి పనులు చేయిస్తున్నరు. వాళ్లు కూడా ఎంతకాలమని పెడ్తరు. అందుకే గురువారం జరిగిన సర్వసభ్య సమావేశాన్ని బీఆర్ఎస్ ఎంపీటీసీలందరం కలిసి వాకౌట్ చేశాం. అయినా సమావేశం కొనసాగించారు. జెడ్పీ చైర్పర్సన్ కూడా సమస్యను ప్రభుత్వాధికారులపైనే నెట్టారు. ప్రభుత్వం నిధులివ్వకపోతే గ్రామాల అభివృద్ధి ఎట్లా జరుగుతది? అధికారులైనా నిధులుంటేనే పనిచేస్తరు. ఇకనైనా ప్రభుత్వం మేల్కోవాలని కోరుకుంటున్నా.