మూసాపేట, మే 14 : ప్రభుత్వ బడుల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అందుకే గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యావంతులు, యువకులు, అధ్యాపకులు సంయుక్తంగా ఇంటింటికీ వెళ్లి సర్కా ర్ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు.
శనివారం మూసాపేట జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.1.40 కోట్ల నిధులతో చేపట్టబోయే భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుతుందని ఆయనన్నారు. చదువుకునే విద్యార్థులు ఫోన్లల్లో చాటింగ్‌లు మానేసి, చదువుపై దృష్టి సారించాలని కోరారు. మూసాపేట, మదనాపురంలో నూతన మండల భవనాల మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అనంతరం నిజాలాపూర్ గ్రామానికి చెందిన భీంసాగర్కు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యాసాగర్, ఎంపీపీ గూపని కళావతి కొండయ్య, డీఈ కృష్ణ, హెచ్ఎం భాస్కర్, నేతలు లక్ష్మీనర్సింహా యాదవ్, భాస్కర్‌గౌడ్, శెట్టి శేఖర్, కొంగయ్య, జమీర్, తిరుపతయ్య, అచ్చాయిపల్లి చంద్రశేఖర్, శివరాములు, ఖలీం, మశ్చందర్‌నాథ్, రాజేశ్వర్‌రెడ్డి, బాలన్న, ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.