రాష్ట్రంలో నీలి విప్లవంపై నీలినీడలు కమ్ముకున్నా యి. వర్షాకాలం ఆరంభమై మూడు నెలలు పూర్తయినా ఇంకా చెరువుల్లోకి చేప చేరేదెన్నడో అంటూ మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని జలాశయాలు, చెరువులు, కుంటల్లో వదిలేందుకు 10 కోట్ల చేపపిల్లలు అవసరం.
చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండుకుండలా ఉన్నా ఉచితంగా అందించాల్సిన చేప పిల్లల టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తి కానేలేదు. కేసీఆర్ సర్కారు మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపితే.. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ దిశగా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకానికి మంగళం పాడడంతో మత్స్యకారుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జలాశయాలు నిం డుకుండలను తలపిస్తున్నాయి. కృష్ణమ్మ, తుంగభద్రతో పాటు భీమా నదులు ఉప్పొంగి ప్రవహించడంతో నదీ పరివాహక ప్రాంతాలన్నీ జలసిరులను సంతరించుకున్నాయి. భారీ వర్షాలతో కుంటలు, చెరువులు, చెక్ డ్యాంలు కళకళలాడుతున్నాయి. వాగులు, వంకలు ప్రవహించడంతో అన్నదాత లు ఆనందంలో ఉన్నారు. అయితే మత్స్యకారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పదేండ్ల కాలంలో కేసీఆర్ ప్ర భుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొ నసాగించింది. జలాశయాలతోపాటు చిన్నచిన్న చెరువులు, కుంటలను కూడా వదలకుండా చేపపిల్లలను పంపిణీ, విడుదల చేయించి మత్స్యకారులకు ఉపాధి కల్పించింది.
కానీ ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయినా ఇప్పటి వరకు చేపపిల్లల పంపిణీ జాడ కనిపించడం లేదు. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళనలో చెం దుతున్నారు. చేపల వేట, అమ్మకం, పెంపకంపై ఆధారపడిన వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించిం ది. ఉమ్మడి జిల్లాలోని అన్ని జలాశయాలు, చెరువులకు కలిపి సుమారు 10 కోట్లకుపైగా చేప పిల్లలు అవసరమవుతాయని అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ప్రతి ఏటా ఎండాకాలం ముగియగానే ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేది.
వర్షాకాలం ప్రారంభం కాగానే టెండర్ల ప్రక్రియ నిర్వహించి చేప పిల్లలను దశలవారీగా వదిలే కార్యక్రమాన్ని చేపట్టేవారు. కానీ ఈసారి వర్షాకాలం ముగుస్తున్నా ఇంతవరకు పంపిణీపై రేవంత్ సర్కారు ఊసెత్తడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మత్స్యకారులకు ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. అధికారు లు అవసరమైన చేపపిల్లల పంపిణీ కోసం టెండర్ల ప్రక్రియ ను నిర్వహించినా ఇంకా ఖరారు చేయలేదు. సర్కారు నుం చి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో బ్రేక్ పడినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యా రెంటీల పేరుతో మోసం చేయడమే గాక మత్స్యకారులను ఉపా ధి లేకుండా చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
పదేండ్లల్లో కేసీఆర్ ప్రభుత్వం ముందస్తుగా టెండర్ల ప్ర క్రియ చేపట్టింది. కానీ ఈసారి అవసరమైన చేప పిల్లల పంపిణీకి జిల్లాల వారీగా టెండర్లను ఆహ్వానించారు. చాలామంది వ్యాపారులు ఇందులో పాల్గొన్నారు. అయితే తెలంగాణకు చెందిన వ్యాపారులు కాక ఆంధ్రాకు సంబంధించిన కాంట్రాక్టర్లు పాల్గొని టెండర్లు దాఖలు చేశారు. అయితే సర్కారు నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఈ టెండర్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. వేసిన టెండర్లను తెరవకుండానే అధికారులు అలాగే ఉంచారు. భారీ వర్షాలు పడి జలాశయాలన్నీ నిండుగా ఉన్నప్పటికీ చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభించేందుకు పైనుంచి ఆదేశాలు లేవని అధికారులు చెబుతున్నారు.
చెరువులు, కుంటలు, జలాశయాలను గుర్తించి వాటిలో ఎన్ని చేప పిల్లలు అవసరమో అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో సుమారు 10 కోట్లకుపైగా చేప పిల్లలు అవసరం పడతాయని అంచనా వేశారు. జిల్లాల వారీగా ఎన్ని చేప పిల్లలు అవసరమో లెక్క తేల్చారు. అయితే రేవంత్ సర్కారు నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది.
అంతేగాక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెరిగిన మత్స్య సంపదంతా ‘ఏటికి ఎదురీది.. ఉన్నదంతా వరదల్లో ఎటో వెళ్లిపోయింది’.. అని మత్స్యకారులు అంటున్నారు. నాలుగైదేండ్లుగా మత్స్య సంపదపై ఆధారపడ్డ వేలా ది కుటుంబాలు ఈసారి చేపపిల్లల పంపిణీ ప్రక్రియ ప్రా రంభం కాకపోవడంతో ఉపాధి కోల్పోయే పరిస్థితి దాపురించింది. స్థానికంగా ఉన్న చెరువుల్లో, కుంటల్లో చేపపిల్లలను వదిలి పెద్దయ్యాక స్థానికంగా ఉన్న మత్స్యకారులు వాటిని పట్టుకొని మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఈసారి ఆ పరిస్థితి లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఒక య జ్ఞంలా నిర్వహించింది. దీంతో ఐదు జిల్లాల్లో పచ్చదనం పరిఢవిల్లింది. అలాగే కులసంఘాలకు సైతం చేయూతనిచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటికి మం గళం పాడింది. మొక్కుబడిగా అక్కడకక్కడ మొక్కల పెంప కం చేపట్టింది. గ్రామాల్లోని నర్సరీలు.. మండల కేంద్రాల్లోని ప్రకృతి వనాలు.. జిల్లా కేంద్రాల్లోని అటవీశాఖ నర్సరీలన్నింటిపై తీవ్ర ప్రభావం పడింది.
ఉపాధి పథకం కింద ఏర్పాటు చేసిన నర్సరీలు ఉంచుతారో..? ఊడగొడుతారో..? తెలియ ని పరిస్థితి నెలకొన్నది. నేడు మత్స్యకారులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. బీసీ వర్గాల్లో ముదిరాజ్ సామాజిక వర్గం మత్స్య సంపదను కాపాడడంలో ముందుంది. ఆ సామాజిక వర్గం ఉపాధిపై కొత్త సర్కారు ఉక్కుపాదం మోపింది. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం మేల్కొని తమను ఆదుకునేందుకు చేప పిల్లలు పంపిణీ చేయాలని మత్స్యకారులు డి మాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనలు తప్పవని మత్స్యకార సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
మత్స్యకారులను పట్టించుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం తమను ఆదుకునేందుకు వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేసింది. ఉచితంగా వాహనాలను అందజేసింది. భారీ వర్షాలతో ప్రస్తుతం అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. అయినా, అధికారులు చేపపిల్లలను పంపిణీ చేయడం లేదు. వరదల కారణంగా ప్రాజెక్టుల్లో ఇదివరకు ఉన్న చేపలు ఎదురీది వెళ్లిపోవడంతో మత్స్యకార్మికులకు ఉపాధి సైతం కరువైంది. తాము బతుకుదెరువు కోసం వలస బాట పట్టాల్సి వస్తున్నది.
– శ్రీనివాసులు, మత్స్య కార్మికుడు, మల్లేపల్లి
ఇటీవల కురిసిన భారీ వ ర్షాలతో ప్రాజెక్టులు, చెరువు ల్లో చేపల పెంపకానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. చేపపిల్లల విడుదలకు సంబంధించి ఫిషరీస్ డిపార్డ్మెంట్ ద్వారా జూలై 20, ఆగస్టు 2, 23వ తేదీల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఆలస్యమైంది. 12 జిల్లాల్లో రీటెండర్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశాం. గురువారం 3:30 గంటల తర్వాత టెండర్లు తెరుస్తాం. ప్రక్రియ పూర్తయిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన మత్స్య కార్మికులకు పూర్తి సబ్సిడీపై చేపపిల్లలను అందజేస్తాం.
– వెంకయ్య, డీఎఫ్వో, నారాయణపేట జిల్లా
ఊట్కూర్ పెద్ద చెరువుకు జూలైలోనే సగం మేర నీళ్లు వచ్చాయి. అప్పటినుంచి చే పలు వదలాలని మత్స్య శా ఖ అధికారులను కోరుతు న్నాం. ఇంతవరకు చేపపిల్లల ను పంపిణీ చేయలేదు. ఆలస్యంగా వదిలితే పిల్లలు పెరగక సరైన ధర రాదు. దీంతో సంఘం ఆర్థికంగా నష్టపో యే ప్రమాదం ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం సంఘాలకు సకాలంలో చేపపిల్లలను పంపిణీ చేసింది. అంతేకాకుండా తమను అన్నివేళలా ఆదుకున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో చేపలు వదిలితే కొంతైనా లాభం చేకూరుతుంది.
– ఎం.నరేశ్, మత్స్య సహకార సంఘం డైరెక్టర్, ఊట్కూర్