మహబూబ్‌నగర్, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘నేను ఈ జిల్లా బిడ్డను.. నన్ను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసింది.. బీజేపీ, బీఆర్ఎస్ను తొక్కి పార్లమెంట్‌కు వెళ్తాం..’ అంటూ శపథం చేసిన సీఎంకు పాలమూరు ప్రజలు షాక్ ఇచ్చారు. అభ్యర్థుల గెలుపు కోసం స్వయంగా ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకొని తిరిగినా కనికరించలేదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన అధికార పార్టీ.. సొంత గడ్డపై పార్లమెంట్ స్థానాన్ని కోల్పోయింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానంతో సరిపెట్టుకున్నది. సొంత జిల్లాలో వరుస ఓటములతో సీఎం రేవంత్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. దీంతో కాంగ్రెస్ కోటలో కమలం పాగా వేసింది. ఉత్కంఠభరిత పోరులో పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా డీకే అరుణ తన సమీప ప్రత్యర్థి (కాంగ్రెస్ అభ్యర్థి) చల్లా వంశీచంద్‌రెడ్డిపై కేవలం 4,500 స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అటు నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి బీజేపీ అభ్యర్థి భరత్ప్రసాద్పై 94,414 భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా కందనూలు పార్లమెంట్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చివరివరకు పోరాడి ఓడారు. పాలమూరులో మాత్రం బీఆర్ఎస్ మూడోస్థానానికే పరిమితమైంది. ఉమ్మడి జిల్లాలో హస్తం, కమలం చెరో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మంగళవారం ఉమ్మడి జిల్లాలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్‌కు సంబంధించి పాలమూరు యూనివర్సిటీలో.. నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌కు సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ సాయంత్రం వరకు కొనసాగింది. అనంతరం గెలుపొందిన అభ్యర్థులకు ఆయా రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణపత్రాలను అందజేశారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు 5,10,747 ఓట్లు రాగా చల్లా వంశీచంద్‌రెడ్డికి 5,06,247.. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి 1,54,792 ఓట్లు వచ్చాయి. కందనూలు పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి 4,65,072 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్ప్రసాద్కు 3,70,658.. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు 3,21,343 ఓట్లు వచ్చాయి. కాగా మల్లు రవి 94,414 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పాలమూరు ఫలితం చివరి వరకు ఉత్కంఠ రేపగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.
రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ, ఎంపీ స్థానాన్ని చేజేతుల కోల్పోయింది. సాక్షాత్తు సీఎం సొంత జిల్లాలోనే అధికార పార్టీకి ఓటర్లు ఎదురు తిరిగారు. 12మంది ఎమ్మెల్యేలున్నా రెండు స్థానాలను కోల్పోవడంతో ఆ పార్టీ నేతలను కోలుకోలేని దెబ్బ పడింది. మరోవైపు ముదిరాజ్ కోటాలో మక్తల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా సీఎం చెప్పినా జనం వారి మాటలను నమ్మలేదు. మక్తల్ నియోజకవర్గంలోనే బీజేపీకి 8,500 మెజార్టీని కట్టబెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో 27వేల మెజార్టీ రాగా.. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీని అందించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా సైలెంట్ అయిపోయారు. తన ఓటమికి కాంగ్రెస్ పార్టీలోని ఒక సెక్షన్ పని చేసిందని వంశీచందర్‌రెడ్డి ఢిల్లీలోని ఏఐసీసీ నాయకులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పరోక్షంగా సీఎం సోదరుడిపై ఆయన ఆరోపణలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా ప్రజలు విభిన్న తీర్పునిచ్చారు. పాలమూరు ఎంపీ స్థానంపై అధికార పార్టీ ఎన్ని ఆశలు పెట్టుకున్నా ఎలాంటి క్యాడర్ లేని బీజేపీకే ప్రజలు పట్టం కట్టారు. కాగా నాగర్‌కర్నూల్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందజేశారు. రెండుస్థానాల్లో వెలువడిన విభిన్న తీర్పు ఆయా రాజకీయ పక్షాలను షాక్‌కు గురిచేసింది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా.. ఈసారి మూడోస్థానానికి పరిమితమయ్యారు.
కందనూలు ఎంపీ స్థానానికి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోరాడి ఓడారు. సివిల్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్పీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకున్నాక పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆర్ఎస్పీ బీఆర్ఎస్లో చేరారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాగర్‌కర్నూల్ ఎం పీ స్థానానికి ఆర్ఎస్పీని అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆర్ఎస్పీ అలంపూర్ సొంత నియోజకవర్గం కావ డం.. గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడంతో పార్లమెంట్ స్థానంపై గురిపెట్టారు. ఏడు అ సెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయారు. ఎంపీగా తనను గెలిపిస్తే కందనూలు అభివృద్ధికి పాటునడతానని హామీ ఇవ్వడంతో అధికార పార్టీ సహా బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. చివరకు ధన బలం, అధికార పార్టీ ఒత్తిళ్లు.. బాగా చదివి సివిల్ సర్వీసెస్‌లో ఉన్న అభ్యర్థిని గెలిపిస్తే తమకు పుట్టగతులుండవని తెర వెనుక కుట్రలకు పాల్పడ్డారు. ప్రచారంలో దూసుకెళ్తున్న ఆర్ఎస్పీకి వచ్చిన జన ప్రభంజనాన్ని చూసిన రెండు పార్టీలు ఏకమై ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులను వెదజల్లాయి. దీంతో ఆర్ఎస్పీ గెలుపు అంచు వరకు వచ్చి ఓటమి పాలయ్యారు.
కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి పుట్టినరోజు నాడే పాలమూరు ఓటర్లు షాకిచ్చారు. కౌంటింగ్, బర్త్ డే ఒకే రోజు రావడంతో ఆయనకు పార్టీ నేతలు విజయాన్ని కానుకగా ఇద్దామని భావించారు. కానీ ఓ టర్లు మాత్రం కనికరించకపోవడంతో పుట్టినరోజు నా డే ఓటమిని చవిచూశారు. గెలిస్తే జన్మదినం, గెలుపు సంబురాలు చేద్దామనుకున్న నేతలను ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఓటమిపై ఆ పార్టీ నేతలు మీడియా ముందుకు రాకపోవడం గమనార్హం. మొత్తంగా ఉమ్మడి జిల్లా ప్రజ లు ఎంపీ ఎన్నికల్లో విభిన్న తీర్పునిచ్చారు.