వనపర్తి, జూలై 17(నమస్తే తెలంగాణ) : సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా సవరణ పనులను వేగవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చందాపూర్, దత్తాయిపల్లి, శ్రీనివాసపూర్, చిమనగుంటపల్లి తదితర గ్రామాల్లో సర్ కార్యక్రమంపై కార్యకర్తలు, బీఎల్ఏలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ పొడిగింపులో బీఆర్ఎస్ పాత్ర గణనీయంగా ఉందన్నారు. ప్రతి ఒక్క ఓటు మిస్ అవ్వకుండా జాబితాలో చేర్చే బాధ్యతలను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దన్నారు.
పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చే వారుంటే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని, ప్రతి ఓటును ఒక ఆయుధంగా వాడుకునేలా ప్రణాళిక ఉండాలన్నారు. బీఎల్వోలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ బీఎల్ఏలు సర్ కార్యక్రమంలో వందశాతం మేర ఫలితాలను సాధించే దిశగా అడుగులు వేయాలని చెప్పారు. సర్ కార్యక్రమంపై అశ్రద్ధ చేస్తున్నట్లుగా ఎవరైనా తారసపడితే.. ఓటు విలువను వివరించి సిద్ధం చేయాలని, పెంచిన సర్ గడువును సద్వినియోగం చేసుకోవడంలో బీఆర్ఎస్ శ్రేణులు ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో నా యకులు మాణిక్యం, రఘువర్ధన్‌రెడ్డి, ధర్మానాయక్, మాధవ రెడ్డి, నరసింహ, నరేశ్, మహేశ్వర్‌రెడ్డి తదితర గ్రామాల సర్పంచులు ఉన్నారు.