వనపర్తి, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రాఫ్ హాలిడే అన్నట్లుగా వ్యవహరిస్తుందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కోర్టు శరతులతో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని సింగిరెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం వనపర్తి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నూతన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నిరంజన్ రెడ్డితోపాటు మాజీ ఎంపీ, రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
అంతకుముందు తన స్వగృహం నుంచి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు స్థానిక నేతలతో కలిసి మోటర్‌సైకిళ్లపై ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్బంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలను గాలికొదిలేశారని, ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు కకావికలమవుతున్నారన్నారు. ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టులా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలంటేనే భయంగా ఉందన్నారు. కోర్టు ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితిలోనే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించిందని, ఇతర అనేక ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయని, ఇక వాటి ఊసే లేదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏఒక్క హామీ అమలు కాలేదని,అమలు చేయడానికి సైతం డబ్బులు లేవంటూ ఎగనామం పెట్టారన్నారు.
రైతుబంధు ఇవ్వాలంటే నానాయాతన పడుతున్నారని, వచ్చే రోజుల్లో సగం..సగం మాత్రమే ఇచ్చి మమ అనిపించేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. పంటలను కాపాడే శక్తి కాంగ్రెస్‌కు లేదని, అలాగే క్రాప్ హాలిడే అంటూ యాసంగిని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు క్రాప్ హాలీడేలు లేవని, కాంగ్రెస్ అంటేనే పంటలకు నీళ్లివ్వదన్నట్లుగా క్రాప్ హాలిడేలకు తెరలేపిందన్నారు. చరిత్రలో అత్యధిక వర్షాలు కురిసిన ఏడాదిగా నమోదు చేసుకున్న తరుణంలో ఇప్పుడు రెండవ పంటకు నీళ్లివ్వలేమని కాంగ్రెస్ చేతులెత్తేయడం అత్యంత దుర్మార్గమని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ఆత్మవిశ్వాసంతో ప్రజలతో కొత్త సర్పంచులు మమేకం కావాలని, గ్రామంలో కలియదిరుగుతూ సమస్యలను గుర్తించాలని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. పాలకమండలి క్రమంగా సమావేశాలు నిర్వహించుకుని, కీలకమైన సమస్యలొస్తే మండల, జిల్లా స్థాయిలో సలహాలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యం, హరితహారం, పాత ట్రాక్టర్ల దుమ్ము దులిపి బాగా పని చేయించాలన్నారు. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వనరులపై సర్పంచులు మీకున్న వనరులపై అధ్యయనం చేయాలన్నారు.
ప్రజలందరినీ ఒకే దృష్టితో చూడాలని, గ్రామానికి సర్పంచ్ తండ్రిలాంటి పాత్ర ఉండి దర్మబద్దంగా పాలన కొనసాగించాలన్నారు. గ్రామానికి వచ్చే నిధుల వినియోగంలోనూ పారదర్శకంగా ఉండాలని, జీపీలకు వచ్చే నిధులు కేంద్రానికి సంబంధించినవి ఎంతమాత్రం కావని, కేవలం జీఎస్టీ ద్వారా మనకు రావాల్సిన వాటా మాత్రమే వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అనేకం అమలు చేయలేదని, వీటిని ప్రజలకు వివరించి అర్థమయ్యే విధంగా సర్పంచులు అవగాహన చేయాలన్నారు.
కొత్త సర్పంచులకు అధికారపార్టీ కావాలని సమస్యలను సృష్టిస్తే…ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ బాసటగా నిలుస్తుందని రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి భరోసా ఇచ్చారు. మీ విధులు,నిధుల వ్యవహారంలో కొత్త సర్పంచులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నల్లా పెట్టి నీటి సరపరా చేస్తే…కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ టాప్ అంటూ కాలయాపన చేస్తుందన్నారు. రెండేళ్లుగా గ్రామాల్లో సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రాధాన్యతా క్రమంలో పారిశుధ్యం, విద్యా, వైద్యం అందించేలా చొరవ తీసుకోవాలన్నారు. ప్రజా సంబంధాలను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని, ఇది చాలా బలంగా పని చేస్తుందన్నారు.
జీపీ స్థాయిలో ఉండే మినిట్స్తోపాటు గ్రామ సభల నిర్వహణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎన్నికలు ముగిసినందునా గ్రామ పాలనపైనే దృష్టి పెట్టాలన్నారు. గ్రామ సర్పంచులు బీఆర్ఎస్కు సైనికులుగా రావుల అభివర్ణించారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధికి పుస్తక రూపం జరిగిందని, అవి మీకు చేతికందగానే ప్రజలను చైతన్యం చేసే బాద్యతలను తీసుకోవాలన్నారు. సర్పంచులకు ఉన్న పవర్ ఎవరికి ఉండదని, ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శకంగా పని చేయాలన్నారు. పంచాయతీ రాజ్ చట్టంను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పకడ్బందీగా రూపొందించడం జరిగిందని, సర్పంచుల అధికారాలకు ఎవరు ఆటంకాలు కల్పించలేరని రావుల పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, నాయకులు నాగం తిరుపతిరెడ్డి, కురుమూర్తి యాదవ్, కృష్ణా నాయక్, మాణిక్యం, కర్రెస్వామి తదితరులు పాల్గొన్నారు.