వరంగల్‌చౌరస్తా, ఫిబ్రవరి 24 : అధికారాన్ని అడ్డుపెట్టుకొని కక్షపూరిత రాజకీయాలు చేయడం మాని, ప్రజల కష్టాలు తీర్చడానికి అధికారాన్ని వినియోగించాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన వరంగల్‌లోని సెంట్రల్ జైల్ స్థలంలో బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాన్ని సందర్శించి, పనులు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించడంలో ఘోరంగా విఫలమైందన్నారు.
దేవాదుల పంప్‌హౌస్‌లను బీఆర్ఎస్ సందర్శించి పది మోటర్లలో కేవలం ఆరు మోటర్లు మాత్రమే పని చేస్తున్నాయని, రోజుకు 2700 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేయాల్సి ఉండగా 1700 క్యూసెక్కులు మాత్రమే లిఫ్ట్ చేస్తున్నారని బయటపెట్టి మోటర్లు పని చేస్తలేవని గుర్తు చేస్తే తప్ప ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదన్నారు. బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ సోయిలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పర్యవేక్షణలో తొమ్మిదిన్నరేళ్లలో రూ.7300కోట్లు ఖర్చు చేసి, 3.20లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండున్నరేళ్లలో పది శాతం పనులు పూర్తి చేయలేదని, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందించలేదన్నారు.
పది శాతం పనులు పూర్తి చేయడానికి 2026 మార్చి వరకని ఇన్చార్జి మంత్రి పొంగులేటి, 2027 మార్చి నాటికని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, 2027 డిసెంబర్ నాటికని సీఎం రేవంత్‌రెడ్డి ముగ్గురు మూడు డెడ్లైన్లు పెట్టారని, డేట్లు మారుతున్నా, డెడ్లైన్లు మారుతున్నా నిధుల మంజూరు, భూసేకరణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదన్నారు. గోదావరి నీటి వినియోగంపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రికి ధైర్యముంటే ‘కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు’ అనే కండీషన్‌తో అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
నిమిషాలు.. గంటలు కాదు.. రోజుల తరబడి గోదావరి జలాలపై తాము ఎప్పటికీ సిద్ధమేనన్నారు. 312 కిలో మీటర్ల పొడవున్న గోదావరిని సజీవంగా నిలిపేందుకు ఎనిమిది బరాజ్‌లు నిర్మించి, 48లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించామన్నారు. గోదావరి జలాల విషయాన్ని కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రస్తావించే ప్రయత్నం చేస్తే రేవంత్‌రెడ్డి అడ్డుకొని, కడియం శ్రీహరితో మాట్లాడి తెలుకోవాలని చెప్పి ఆయన పరువు తీశారని అన్నారు. ఇప్పటికైనా మిగిలివున్న పది శాతం పనులు పూర్తి చేసి, తెలంగాణ పొలాలకు నీటిని అందించడంపై దృష్టి పెట్టాలన్నారు.
ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం ఊదరగొట్టంది అంతా ఉత్తదేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉద్యోగులకు తీపి కబురు చెప్తామని గొప్పలు చెప్పుకోవడం దారుణమన్నారు. ఈహెచ్ఎస్లో ఉద్యోగుల వాటా గతంలో ఒక శాతం ఉంటే ఇప్పుడు ఒకటిన్నర శాతం చెల్లించేలా చేసిందని, అది తీపి కబురు పాత కబురు కాదని, అది వడ్డింపు కబురని ధ్వజమెతారు. ఉద్యోగస్తులకు కొత్త పీఆర్సీ అమలు, ఏరియల్స్ చెల్లింపులు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇలాంటివి ఉంటే తీపి కబురు కానీ, అదనపు బారం పెడితే తీపి కబురు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో మైసయ్య అనే రిటైర్డ్ ఎస్సై వైద్యానికి డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయిన వైనాన్ని ఆయన ఉదహరిస్తూ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీంగా ఉందన్నారు.
రెండున్నరేండ్లు అయినా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వరా?
కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండున్నరేండ్లు అయినా జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వరా అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు ఏం పాపం చేశారని ఈహెచ్ఎస్ స్కీమ నుంచి తొలగించారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు ఫ్రీ హెల్త్ సీమ్‌ను అమలు చేసిందని, ఉద్యోగులు చెల్లించిన వాటాను కూడా జర్నలిస్టులు చెల్లించకుండా కేసీఆర్ జాగ్రత్త తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జర్నలిస్టులకు కూడా ఈహెచ్ఎస్ మాదిరే జేహెచ్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులను ఆదుకున్నది, కరోనా సమయంలో సాదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన గుర్తుచేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా రూ. 100 కోట్లతో జర్నలిస్టు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిందని, రూ. 50 కోట్లతో తెలంగాణ మీడియా అకాడమీ భవనాన్ని పూర్తి చేసిందన్నారు. జర్నలిస్టులను ఎన్నికల సమయంలో వాడుకొని బడ్జెట్లో రూ. 16 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి కనీసం 16 పైసలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయలేదని మండిపడ్డారు. ఎలాంటి నిబంధనలు లేకుండా జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే, జర్నలిస్టులకు తమ ప్రభుత్వం మాదిరిగానే రూ. 5 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసేందుకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. వరంగల్ తూర్పులో జర్నలిస్టుల కోసం 200 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయినా, పంపిణీకి కాంగ్రెస్ నాయకులు అడ్డుపుల్లలు వేస్తున్నారు. అధికారం కోసం జర్నలిస్టులను నెత్తినెత్తుకొని ఇప్పుడు పట్టించుకోకుండా కష్టపెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదని, నిన్న వరంగల్‌లో కార్పొరేటర్‌ను, మొన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను, మెదక్ జిల్లా ఆమన్‌గల్లులో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేసి, కుట్ర రాజకీయాలు చేస్తున్నదని అన్నారు.
ఈ కుట్రలు, కుతంత్రాలు మాని ప్రజలకు మేలు జరిగేలా పాలించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‌భాస్కర్, తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్, శంకర్‌నాయక్, సీనియర్ నాయకులు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఉత్తర తెలంగాణకు సంజీవని అయిన ఎంజీఎం దవాఖానపై స్థానిక మంత్రులు, శాసన సభ్యులకు చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పేదలకు వైద్యసేవలు అందాల్సిన దవాఖాన ఎలుకలు, పందికొక్కులకు ఆవాసంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వరంగల్ పర్యటించి వెళ్లారే తప్ప.. దవాఖాన వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎంజీఎం వైద్యాధికారుల పర్యవేక్షణలో 250 గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని వసతులు కల్పించామని, ఇప్పుడు ఏసీలు పనిచేయకపోవడంతో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయని చెప్పారు. కరోనా కాలంలో మూడు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే.. ఈ ప్రభుత్వానికి వాటిని నడిపించడం చేతకావడం లేదన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి పేద ప్రజల ఆరోగ్యం పట్టదని, రియల్ ఎస్టేట్ వ్యాపారమే ముఖ్యమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఫ్యూచర్‌పై సిటీ తప్పా.., హెల్త్ సిటీపై పట్టింపు లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 24 అంతస్తుల భవనానికి అనుమతులిచ్చి, నిధులు మంజూరు చేసి 24 అంతస్తుల నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేశామని, ఫినిషింగ్ పనులు చేపట్టడానికి రెండున్నరేళ్లు కాలం వెళ్లదీశారని అన్నారు. హాస్పిటల్ అందుబాటులోకి వస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే పనులు ఆలస్యమయేలా కుట్రలు చేశారని అన్నారు.
2024 దసరా పండగకు ప్రారంభించాల్సిన హాస్పిటల్‌ను రెండున్నరేళ్లపాటు నిర్లక్ష్యం చేశారని, ధర్మశాల నిర్మాణంలో రోడ్లు, ఎలివేషన్ వర్క్స్, యంత్ర పరికరాల విషయంలో కోతలు విధించడం, నిర్ణయాలు తీసుకోవడంలో అలసత్వం వహించడంతో పనులు అటకెక్కాయని అన్నారు. జూన్ 2న ప్రారంభానికి చర్యలు చేపడుతన్నామని అధికారులు చెబుతున్నా.., అందుకు తగినట్లు పనులు మాత్రం కనిపించడం లేదన్నారు. 2వేల పడకల హాస్పిటల్‌కు అవసరమైన సుమారు 2వేల మంది నర్సింగ్ స్టాఫ్, 1500 మంది వైద్యులు, వెయ్యి మంది పారామెడికల్ సిబ్బంది రిక్రూట్మెంట్కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందా..? నోటిఫికేషన్ ఇచ్చారా..? అని ప్రశ్నించారు. హాస్పిటల్‌ను అందుబాటులోకి తీసుకురాని పక్షంలో బీఆర్ఎస్ తరఫున ఇక్కడే నిరాహార దీక్షకు పూనుకుంటామని అన్నారు.