మరికల్, ఆగస్టు 22 : ఇంట్లో బట్టలు ఐరన్ చేస్తుండగా ఐరన్ బాక్స్(Iron box)షార్ట్ సర్క్యూట్ అవడంతో మహిళ మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని అప్పంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సంజనోల్ల అనంతమ్మ(57) గురువారం రాత్రి బట్టలను ఐరన్ చేస్తుండగా ఐరన్ బాక్స్ షార్ట్ సర్క్యూట్ అయి తీవ్ర గాయాలు కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మరికల్ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స చేయించారు.
చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి భర్త సంజనోల్ల బాల్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మరికల్ ఎస్సై రాము తెలిపారు. అనంతమ్మకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అనంతమ్మ మృతితో అప్పంపల్లిలో విషాదఛాయలు అమలుకున్నాయి.