మరికల్, ఆగస్టు 25: నారాయణపేట జిల్లా మరికల్ (Marikal) మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ పాఠశాలలో 57 మంది విద్యార్థులకుగాను ఆరుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉండని టీచర్లు సమయానికి పాఠశాలకు హాజరుకావడం లేదు. అసలు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారో వారికే తెలియడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రెగ్యులర్ స్టాఫ్ రాకపోవడంతో సోమవారం ఉదయం ప్రైవేటు ఉపాధ్యాయురాలు ప్రార్థన చేయించారు.
కాగా, ఉర్దూ మీడియం పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న కరీముల్లా మండల విద్యాశాఖ అధికారిగా (MEO) వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలోనే ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా సక్రమమైన విద్యాబోధన చేపట్టడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎంఈఓ పాఠశాలలోనే ఉపాధ్యాయుల సమయపాలన పాటించక ఉంటే మండలంలోని ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.