ఊట్కూర్, సెప్టెంబర్ 22: వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ మనుషులు, పశువులపై దాడికి పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం పెద్దపొర్ల గ్రామంలో వీధి కుక్కల దాడిలో పలువురు వ్యక్తులతో పాటు, పశువులు గాయపడిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు..ఆదివారం సాయంత్రం చీకటి పడే సమయంలో రెండు వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ రోడ్డుపై వచ్చి వెళ్లే వారిపై దాడికి తెగబడగా అజయ్ (6), శ్రావ్య (7), లక్ష్మి (17), కొండమ్మ(40), శశికళ (50) అనే మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
మనుషులతో పాటు ఒక ఎద్దు, ఆవుపై కూడా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను చికిత్స కోసం స్థానికులు మహబూబ్ నగర్ జిల్లా దవాఖానకు తరలించారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో వీధి కుక్కల దాడి సంఘటనలు పెరిగిపోతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి కుక్కలను తరలించేందుకు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.