Narayanpet | మక్తల్, జూన్ 12: జాతీయ రహదారి 167 పై భారీ రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన మరువకముందే గంటన్నర వ్యవధిలో మరో యాక్సిడెంట్ జరిగింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ గ్రామ సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్ మండలం రామసముద్రం గ్రామానికి చెందిన వీరేశ్ అనే యువకుడు తన సొంత ఏపీ 22 ఏక్యూ 3735 నెంబర్ గల కారులో గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో జక్లేర్ గ్రామం నుంచి మక్తల్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారి 167పై రాయచూర్ వైపునకు వెళ్తున్న ఓ లారీ(TG07U 5566)ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం భారీగా దెబ్బతిన్నది. కారు నడుపుతున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, వర్షం పడుతుండటంతో కారు బ్రేక్‌లు పడకపోవడం వల్లే అదుపుతప్పి లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
కాగా, బుధవారం తెల్లవారుజామున మక్తల్ సమీపంలో జాతీయ రహదారి 167 పై లారీని వెనుక నుంచి ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గకు చెందిన దుర్గమ్మ ట్రావెల్స్ వోల్వో బస్సు 29 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరింది. గురువారం తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో మక్తల్ మండలం నర్సిరెడ్డిపల్లి, జక్లేర్ గ్రామాల శివారులోని జాతీయ రహదారి 167 పై లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మొత్తం ధ్వంసమైంది. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ 18 మందిని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని ఎస్సై భాగ్యలక్ష్మీ రెడ్డి తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఏడు మందిని రాయచూర్, మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రులకు తరలించామని పేర్కొన్నారు.