ఊట్కూర్, ఏప్రిల్ 01 : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను అమలు చేయడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్‌లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి సలీం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని మెయిన్ బజార్ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల సంఘం సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల కుటుంబాలకు అందాల్సిన ప్రసూతి, పెళ్లి కానుక, సహజ మరణం, ప్రమాద బీమా క్లెయిమ్స్ లను జిల్లా లేబర్ కార్యాలయానికి పంపి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా అధికారులు దరఖాస్తులను పెండింగ్ లో ఉంచినట్లు తెలిపారు. ఒక్క ఊట్కూరు మండలంలోనే వందకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, దీనిపై విచారణ జరిపి కార్మికులకు తక్షణమే బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
5 సంవత్సరాలకు చెల్లుబాటయ్యే లేబర్ కార్డులు రెన్యువల్ గడువు దాటిపోవడంతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోతున్నాయని, దీంతో కార్మికులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించి రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమిస్తున్న భవన కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో దయనీయ స్థితిని అనుభవిస్తున్నారని, సమస్యల పరిష్కారం కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవన కార్మికుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక పర్యాయాలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన అధికారులు, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్మికులకు ఇస్తున్న ప్రసూతి, పెళ్లి కానుకను రూ.50 వేలకు పెంచాలని, సహజ మరణం పొందిన కార్మికుడికి రూ.5 లక్షలు, ప్రమాద బీమా రూ.10 లక్షలకు పెంచి వెంటనే అమలులోకి తేవాలన్నారు. సమావేశానికి కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కూతలి నాగేశ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సంఘం మండల గౌరవ అధ్యక్షుడు గరిడి లక్ష్మారెడ్డి, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నప్ప, ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య, అంజప్ప, నారాయణ, శ్రీను, లక్ష్మయ్య పాల్గొన్నారు.