Kodangal Lift | ఊట్కూర్, మే28: నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో భూములు కోల్పోతున్నవారంతా సన్న, చిన్నకారు రైతులం. తాత ముత్తాతలు, తండ్రుల కాలం నుంచి వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నాం. బంగారు పంటలు పండే మా భూములను కోల్పోతే మాకు భవిష్యత్తు ఉండదు. మేం కోరిన భూ పరిహారం ఇవ్వండి. అప్పుడే లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి మా భూములను అప్పగిస్తాం. లేకపోతే మా శవాలపై ప్రాజెక్టును కట్టుకోండి’ అంటూ ఊట్కూర్ మండల కేంద్రం (దంతన్‌పల్లి) రైతులు అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న ఆర్అండ్ ఆర్ రైతులతో గ్రామసభ ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు. దంతన్ పల్లి శివారులో ఓపెన్ కెనాల్ నిర్మాణం కింద భూములు కోల్పోతున్న రైతుల వివరాలను అధికారులు సభలో వినిపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో పూర్తిగా వ్యవసాయ భూములు కోల్పోయిన రైతులను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా అందే పరిహారంతో పాటు పునరావాసం-పునరాశ్రయం ద్వారా అదనపు లాభాలు వర్తింప చేస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనులు ముందుకు సాగేందుకు రైతులు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు కలగజేసుకొని.. లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారిలో చాలామంది చిన్న, సన్న కారు రైతులమే ఉన్నామని, ఉన్న భూమి కోల్పోయి తమకు ఎకర, అర ఎకర భూమి మాత్రమే మిగిలితే వ్యవసాయం ఏ విధంగా చేసుకోవాలో అధికారులే చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో సన్న, చిన్నకారులుగా ఉన్న ప్రతి రైతుకు ఆర్అండ్ఆర్ (Rehabilitation- Resetelment) ద్వారా అందే సౌకర్యాలను వర్తింపజేయాలని కోరారు. ప్రధానంగా దంతన్ పల్లి శివారులో ఎకరా భూమి రూ.కోటి వరకు పలుకుతుందని, కనీసం తమకు ఎకరాకు రూ.60 లక్షలతో పాటు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలల నుంచి అధికారులు వచ్చి సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్పితే తమ భూములకు పరిహారం ఎంత ఇస్తారన్న మాట చెప్పడం లేదని రైతులు తమ వాదనను వినిపించారు. మరోపక్క ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో పొలాల్లో పంట సాగు చేయాల్సి ఉందని, తమకు కోరిన పరిహారం అందిస్తేనే భూములను అప్పగిస్తామని, ఈ విషయాలన్నింటినీ గ్రామ సభ మినిట్స్ బుక్‌లో నమోదు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు.
రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిర్వహించిన భూ సేకరణ సర్వేలో దంతన్ పల్లి శివారులోని 104 సర్వే నంబర్లు 15 మంది పట్టాదారు రైతులకు బదులు కాస్తుదారుల పేర్లు నమోదు కావడంతో తామంతా ప్రభుత్వం అందించే పరిహారానికి అర్హత కోల్పోతున్నామని, పొజిషన్లో ఉన్నప్పటికీ వ్యవసాయ భూములను వదులుకోవాల్సి ఉంటుందని, రీ సర్వే నిర్వహించి తమకు సరైన న్యాయం చేకూర్చాలని రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకుపోయారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వినిపించి సరైన న్యాయం జరిపిస్తామని జిల్లా కలెక్టర్, ఆర్డీవో సమక్షంలో సమావేశపరిచి రైతులకు తగిన న్యాయం జరిపిస్తామని తహసిల్దార్ చింత రవి హామీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజయ గౌడ్, ఆర్ఐ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ సూర్య ప్రకాశ్ రెడ్డి, రైతులు గోపాల్ రెడ్డి, ధర్మరాజు గౌడ్, తరుణ్ రెడ్డి, బోయిని రవి, భాస్కర్, అనీల్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, సురేందర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, నంద కిషోర్, సంజప్ప, రామ్‌రెడ్డి పాల్గొన్నారు.