ఊట్కూర్, ఆగస్టు 25: కుక్కల గుంపు ఓ వానరంపై (Stray Dogs) దాడి చేయడంతో అది మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలో శునకాలు గుంపులుగా చేరి కనిపించిన పశువులపై దాడికి తెగబడుతున్నాయి. ఇదే క్రమంలో సోమవారం ఉదయం వివేకానంద చౌరస్తా సమీపంలో ఇండ్ల మధ్య సంచరిస్తున్న ఓ వానరంపై కుక్కల మంద మూకుమ్మడిగా దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన వానరం ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. కొద్ది నెలలుగా కుక్కల బెడద అధికంగా ఉందని, చిన్నపిల్లలు, మనుషులపై దాడి చేసే అవకాశం లేకపోతే లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఊర కుక్కలను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, మృతి చెందిన వానరానికి హిందూ సంఘాల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల వరకు శునకాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీధుల్లో రెండు ఉండాల్సిన కుక్కలు దాదాపు 20 వరకు ఉంటున్నాయి. రాష్ట్రంలో గతేడాది గంటకు 14 మంది కుక్కకాటుకు గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 13 మంది రేబిస్ వ్యాధికి గురై మృతి చెందారు. ముఖ్యంగా చిన్నారులు పాఠశాలకు వెళ్తున్నప్పుడు లేదా విధీలో ఆడుకుంటున్నప్పుడు ఎక్కువగా కుక్క కాటుకు గురవ్వడం కలకలం రేపుతున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో 1,21,997 మందిని శునకాలు కరిచాయి. ఈ ఏడాది చూసుకుంటే జనవరి నుంచి జూలై వరకు 87,366 మందిని కరిచాయి.