సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ప్రమాదంలో 8 నెలల గర్భిణి(Pregnant Woman) మృతిచెందింది. భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి ఈవినింగ్ వాకింగ్‌కు వెళ్లిన 33 ఏళ్ల సమన్వితా ధారేశ్వర్ ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. జార్జ్ స్ట్రీట్‌లో రాత్రి 8 గంటలకు వాకింగ్ చేసి రోడ్డు దాటుతున్న సమయంలో ఆ దిశగా వస్తున్న కియా కార్నివల్ కారు నెమ్మదించింది. అయితే దాని వెనుక వస్తున్న బీఎండబ్ల్యూ కారు వేగంగా దూసుకువచ్చి కియా కారును ఢీకొట్టింది. ఆ వేగం ధాటికి కియా కారు ముందుకెళ్లింది. అయితే నడుచుకుంటూ వెళ్తున్న సమన్వితను ఢీకొట్టడంతో ఆమె గాయపడింది. తీవ్రంగా గాయాలు కావడంతో ఆమెను వెస్ట్‌మీడ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ డాక్టర్లు ఆమెను బ్రతికించలేకపోయారు. పుట్టబోయే బిడ్డను కూడా రక్షించలేకపోయారు.
బీఎండబ్ల్యూ డ్రైవర్‌ను 19 ఏళ్ల ఆరన్ పాపజోగా గుర్తించారు. అతనితో పాటు కియా డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ధారేశ్వర్ భర్త, కుమారుడికి ఏం జరిగిందన్న దానిపై అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. ఐటీ సిస్టమ్స్ అనలిస్ట్ గా ధారేశ్వర్ లింక్డిన్ ప్రొఫైల్‌లో ఉన్నది. అలస్కో యునిఫామ్స్ కంపెనీలో టెస్ట్ అనలిస్ట్‌గా ఉద్యోగం చేస్తున్నారు.