మాగనూరు, నవంబర్ 18 : ఎంఎస్ఆర్ రైస్ మిల్లులో వే బ్రిడ్జి నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని మాగనూరు-వర్కూరు గ్రామ రైతులు ఆరోపించారు. ఈ నెల 4,5 వ తేదీన ఇదే రైస్ మిల్లులో వే-బ్రిడ్జి ఇలా అవకతవకలు ఉన్నాయని.. ఒక్కో రైతు నుంచి క్వింటాళ్ల కొద్ది ధాన్యం కటింగ్ చేస్తూ ట్రక్ షీట్లు రాసిస్తున్నట్లుగా రైతులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ రైస్ మిల్లుపై సంబంధిత సివిల్ సప్లయ్, తూనికల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి ఆ రైస్ మిల్లు పై కేసులు నమోదు చేశామని తెలిపారు.
ఈ రైస్ మిల్ యజమాని నిర్వహణలో ఏమాత్రం మార్పు లేకుండా రైస్‌మిల్లును యథావిధిగా కొనసాగిస్తున్నారని.. రైతులకు మూడు నుంచి టన్ను వరకు క్వింటాళ్ల వరకు వరి ధాన్యాన్ని తక్కువ చూపి ట్రక్ షీట్లలో దాదాపు 30 నుంచి 40 బస్తాలు తక్కువ రాసి ఇస్తుండడంతో మంగళవారం వర్కూర్ గ్రామానికి చెందిన నరసింహ అనే రైతు 523 బ్యాగులతో కూడిన ఒక లారీని సుబ్రేశ్వర రైస్ మిల్లులో వే బ్రిడ్జిలో వేయిస్తే.. 31 టన్నుల 260 కిలోల వరి ధాన్యం వచ్చిందని.. ఇదే లారీని ఎంఎస్ఆర్ ఇండస్ట్రీ వే-బ్రిడ్జిలో తూకం వేయిస్తే 31 టన్నుల 70 కిలోలుగా వచ్చిందని తెలిపాడు. దాదాపు టన్నుకుపైగా వరి ధాన్యం తక్కువగా చూపించడంతో మళ్లీ ఈ తంతాంగం బయటికి వచ్చింది.
దాంతో వర్కూర్, నేరడగం గ్రామస్తులు రైస్ మిల్ దగ్గరకు చేరుకొని వే బ్రిడ్జి నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆధారాలతో రైస్ మిల్ యజమానిపై మండిపడ్డారు. రైస్ మిల్లులో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా సివిల్ సప్లయ్, తూనికలు కొలతల శాఖ అధికారులు మిల్లు యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అధికారుల హస్తం ఉందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా రైతులను నిలువు దోపిడీ చేస్తున్న మిల్లును సీజ్ చేయాలని రైతులు కోరారు.