ASUS ProArt P16 | ఉద్యోగ రంగంలో ప్రస్తుతం ఎంత పోటీ ఉందో అందరికీ తెలిసిందే. నైపుణ్యం ఉంటే కానీ ఉద్యోగం రాని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది క్రియేటర్లుగా, గేమర్లుగా, ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి డబ్బు సంపాదిస్తున్నారు. అందులో భాగంగానే తమ వృత్తి కోసం అద్భుతమైన ఫీచర్లు కలిగిన పీసీలను కూడా ఉపయోగిస్తున్నారు. కంటెంట్‌ను క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం వంటి పనులకు అత్యధిక కాన్ఫిగరేషన్ కలిగిన పీసీలను వారు కొనుగోలు చేస్తున్నారు. అందులో భాగంగానే కంపెనీలు కూడా అలాంటి పీసీలను రూపొందించి యూజర్లకు అందించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక ఇదే కోవలో అసుస్ కూడా కంటెంట్ క్రియేటర్లు, గేమర్ల కోసం ఓ నూతన విండోస్ ల్యాప్ టాప్‌ను లాంచ్ చేసింది. అసుస్ ప్రొ ఆర్ట్ పి16 పేరిట ఓ నూతన ల్యాప్ టాప్ ను అసుస్ కంపెనీ భారత్‌లో విడుదల చేసింది. ఇందులో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు.
అసుస్ ప్రొ ఆర్ట్ పి16 ల్యాప్ టాప్‌ను ప్రత్యేకంగా ప్రొఫెషనల్ క్రియేటర్లు, గేమర్స్, డిజైనర్లు, ఎడిటర్స్, యానిమేటర్స్, ఫొటోగ్రాఫర్స్, కంటెంట్ క్రియేటర్ల కోసం రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. ఇందులో ఏఎండీకి చెందిన రైజెన్ ఏఐ 9హెచ్ఎక్స్370 అధునాతన ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇది 50 టాప్స్ ఏఐ యాక్సలరేషన్ను ఇస్తుంది. కనుక ఏఐ పనులను కూడా చాలా వేగంగా నిర్వహించుకోవచ్చు. ఇందులో ఎన్వీడియాకు చెందిన జిఫోర్స్ ఆర్టీఎక్స్ 5090 ల్యాప్ టాప్ జీపీయూను ఇచ్చారు. ఇది 24జీబీ జీడీడీఆర్7 గ్రాఫిక్స్ మెమొరీని కలిగి ఉంది. కనుక 4కె లేదా 8కె వీడియోలను అత్యంత నాణ్యంగా వచ్చేలా క్రియేట్ లేదా ఎడిట్ చేసుకోవచ్చు. అద్భుతమైన ఏఐ ఆధారిత ఎఫెక్ట్స్‌ను వీడియోలకు జోడించవచ్చు. ఇందుకు గాను ఇంటిగ్రేటెడ్ ఏఐ టూల్స్‌ను కూడా అందిస్తున్నారు. యూజర్లకు మైక్రోసాఫ్ట్‌కు చెందిన కోపైలట్ ప్లస్ పీసీ తోపాటు ఎన్వీడియాకు చెందిన ఆర్టీఎక్స్ ఏఐ యాక్సలరేషన్ టూల్‌ను ఈ ల్యాప్ టాప్‌లో అందిస్తున్నారు.
ఈ ల్యాప్‌టాప్ 16 ఇంచుల 4కె అసుస్ ల్యుమినా ప్రొ ఓలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. కనుక ల్యాప్ టాప్ తెరపై అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. అలాగే కంటెంట్ క్రియేటింగ్, ఎడిటింగ్ కోసం ఈ డిస్ప్లే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ల్యాప్ టాప్‌లో వైఫై 7 ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల వేగవంతమైన వైఫైని పొందవచ్చు. అలాగే యూఎస్బీ 4 టైప్ సి, హెచ్డీఎంఐ 2.1 ఎఫ్ఆర్ఎల్, ఎస్డీ కార్డ్ రీడర్ వంటి సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు. ఈ ల్యాప్ టాప్‌ను మెటల్ చాసిస్‌తో మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో రూపొందించారు. అందువల్ల ల్యాప్ టాప్ చాలా మన్నికగా, దృఢంగా ఉంటుంది. కాస్త రఫ్‌గా ఉపయోగించినా నష్టం ఉండదు. ఈ ల్యాప్ టాప్‌లో ప్రత్యేకంగా అసుస్ డయల్ ప్యాడ్ సాఫ్ట్ వేర్‌ను అందిస్తున్నారు. దీని సహాయంతో క్రియేటర్ టూల్స్‌ను నియంత్రించవచ్చు. ఈ ల్యాప్ టాప్‌ను కొన్నవారికి 3 నెలల పాటు అడోబి క్రియేటివ్ క్లౌడ్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే అసుస్‌కు చెందిన ఏఐ యాప్స్ ను జీవితకాలం పాటు ఉచితంగా పొందవచ్చు.
ఈ ల్యాప్‌టాప్‌లో యూజర్లకు విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ కలిగిన వెబ్ కెమెరాను ఇచ్చారు. విండోస్ హలో సహాయంతో ల్యాప్ టాప్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. 64జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. 2టీబీ వరకు స్టోరేజ్‌ను పొందవచ్చు. బ్లూటూత్ 5.4ను ఇచ్చారు. బ్యాక్లిట్ చిక్లెట్ కీబోర్డు ఉంది. ప్రత్యేకంగా కో పైలట్ కీని ఏర్పాటు చేశారు. డాల్బీ అట్మోస్ ఫీచర్ లభిస్తుంది. కనుక అద్భుతమైన ఆడియోను ఆస్వాదించవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 90 వాట్ అవర్ 4 సెల్ లిథియం పాలిమర్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. 240 వాట్ల పవర్ అడాప్టర్ లభిస్తుంది. కనుక బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది. ఈ ల్యాప్ టాప్‌లో అద్భుతమైన హార్డ్ వేర్ ఫీచర్లను అందిస్తున్నప్పటికీ దీని బరువు కేవలం 1.95 కిలోలుగా ఉండడం విశేషం. ఇక అసుస్ ప్రొ ఆర్ట్ పి16 ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.3,59,990గా ఉంది. దీన్ని అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌తోపాటు అమెజాన్, అసుస్ ఆన్ లైన్ స్టోర్స్ లో విక్రయిస్తున్నారు.