జడ్చర్లటౌన్, నవంబర్14 : సల్సార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం సంభవించి ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన మంగళవారం జడ్చర్ల మండలం గొల్లపల్లి శివారులో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని గొల్లపల్లి శివారులోని సల్సర్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో మంగళ వారం సాయంత్రం ఆకస్మాత్తుగా పత్తి మిషన్ వద్ద షార్ట్‌సర్కూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న ఒడిశా రాష్ర్టానికి చెందిన పప్పుశెట్టి (26), బీహార్ రాష్ర్టానికి చెందిన హరేందర్ (23) ఎగిసిపడిన మంటల్లో కాలి అక్కడిక్కడే మృతి చెందగా, బీహార్ రాష్ర్టానికి చెంది న సోము(21), ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవరాజ్(24) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులిద్దరిని చికిత్స నిమిత్తం 108లో మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జడ్చర్ల సీఐ కమలాకర్, ఎస్సై జయప్రసాద్తోపాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు.
అప్పటికే అ క్కడున్న పత్తి కాలి బూడిదయ్యింది. ఆ తర్వా త మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ జానకి, డీఎస్పీ వెంకటేశ్వ ర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులు, తోటి కార్మికులు ఆందోళన చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ మేరకు జడ్చర్ల పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం విషయా న్ని తెలుసుకున్న జడ్చర్ల బీఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, బీఆర్ఎస్ నాయకులు ప్రణీల్‌చందర్, ఇంతియాజ్, శ్రీకాంత్, కరాటే శ్రీను, శివలింగం, పురుషోత్తం, శ్రీను బాధిత కుటుంబ సభ్యుల ను పరామర్శించారు. మృతుల కుటుంబాల కు పరిహారం అందించాలని కోరారు.