న్యూఢిల్లీ: అల్ ఫలాహ్ గ్రూపు(Al Falah Group) చైర్మెన్ జావద్ అహ్మద్ సిద్ధిక్ మంగళవారం ఈడీ అరెస్టు చేసింది. అల్ ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్టు మనీల్యాండరింగ్ కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సిటీ కోర్టు డిసెంబర్ ఒకటో తేదీ వరకు అంటే 13 రోజుల పాటు అతన్ని ఈడీ కస్టడీలోకి తీసుకున్నది. అడిషనల్ సెషన్స్ జడ్జీ షీతల్ చౌదరీ ప్రధాన్ బుధవారం రాత్రి ఒంటి గంటకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎంపీఎల్ఏ చట్టంలో సెక్షన్ 19 కింద సిద్ధిక్‌ను అరెస్టు చేశారు. ఈడీ రిమాండ్ కోసం అతన్ని రాత్రిపూట కోర్టుకు తీసుకెళ్లారు. అల్ ఫలాహ్ గ్రూపుపై విచారణ చేపట్టిన తర్వాత ఈడీ ఈ చర్యలు తీసుకున్నది. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఏజెన్సీ చర్యలు మొదలుపెట్టింది. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ కాలేజీ .. విద్యార్థులను, పేరెంట్స్‌ను తప్పుదోవ పట్టించినట్లు గుర్తించారు. ఎన్ఏఏసీ అక్రిడిటేషన్ ఉన్నట్లు నమ్మించారని ఆరోపించారు. 1956 యూజీసీ చట్టంలోని సెక్షన్ 12(బీ) కింద యూజీసీ అనుమతి ఉన్నట్లు కూడా ఆ యూనివర్సిటీ తప్పుగా చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి.