మక్తల్, నవంబర్ 22: మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఇలాకాలో గతుకుల రోడ్లలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందేమోనని ప్రణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. మక్తల్ (Makthal ) నుంచి నారాయణపేటకు వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డుపై రోజూ వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. భారీ వాహనాలు తిరుగుతుండటంతో రోడ్డుపై పెద్దపెద్ద గుంటలు ఏర్పడ్డాయి. వాటిలో వాహనాలు ఇరుక్కుపోయి తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ రోడ్డుపై ఏ క్షణమైనా పెద్ద ప్రమాదం సంభవించడం ఖాయమని, ప్రజల ప్రాణాలు పోయిన తర్వాతే ప్రభుత్వానికి సమస్యలు గుర్తుకు వస్తాయా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
నారాయణపేట జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి రోజురోజుకు ప్రమాదాలకు వేదికగా మారుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు రోడ్డును బాగుచేయడంపై దృష్టిసారించడం లేదని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు. ప్రధాన రహదారి భారీ గుంతలతో నిండిపోవడంతో పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడినప్పటికీ, మరమతులు చేపట్టాల్సిన అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో మక్తల్ నుంచి నారాయణపేట జిల్లా కేంద్రంలోని దవాఖానకు రోగులను తరలించాలంటే నరకయాతన అనుభవించాల్సి వస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం రోడ్డును బాగు చేసే మౌలిక సదుపాయాలపై నిర్లక్ష్యం చూపుతుండడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రిగా ఉన్నప్పటికీ.. ఆయన నియోజకవర్గంలోనే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజల ప్రాణాలను, దృష్టిలో ఉంచుకొని నారాయణపేట జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డును అభివృద్ధి చేయాలని మక్తల్ ప్రజలు కోరుతున్నారు.
