మక్తల్, నారాయణపేట జిల్లా : మక్తల్ సర్కిల్ సీఐ జి చంద్రశేఖర్ ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీకి పట్టుబడ్డారు. 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా మహబూబ్‌నగర్ ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. మక్తల్ పట్టణంలో శ్రీనిధి కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ సంధ్యా వెంకట్ రాములు ఒక రేప్ కేసులో నిందితుడు. ఆయనకు ఇటీవలే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతి సోమవారం ఆయన మక్తల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టాల్సి ఉంది.
అయితే అనుకూలంగా చార్జిషీట్ వేస్తా అని చెప్పి లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం నాడు 20వేలు లంచం తీసుకుంటూ శివారెడ్డి, నరసింహ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీకి దొరికిపోయారు వీరితో పాటు సిఐ చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకొని మక్తల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. వారిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.